తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణాన్ని ప్రభావితం చేసే ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయడం కోసం రెండు కమిటీలను కేంద్ర ప్రభుత్వం నియమించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుల మేరకు ‘స్టేట్ లెవెల్ ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ ఫర్ తెలంగాణ’ (SEIAA)కు ఛైర్మన్ గా డా. గౌరవరం సబిత, సభ్యులుగా అటవీశాఖ మాజీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ స్వర్గం శ్రీనివాస్, సభ్యకార్యదర్శిగా తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక కార్యదర్శిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే డా. ఎం. రాంగోపాల్ రెడ్డి చైర్మన్ గా రాష్ట్రస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులుగా పర్యావరణ రంగంలో నిపుణులైన 13 మందిని నియమించింది. సభ్యుల్లో డా. సరిత సజ్జా ఒకరు. అలాగే తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియం త్రణ మండలి జాయింట్ చీఫ్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ ఈ నిపుణుల కమిటీకి సభ్యకార్యదర్శిగా వ్యవహరిస్తారని తెలిపింది. రాష్ట్రంలో చేపట్టబోయే అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా పర్యావరణంపై పడే ప్రభావాన్ని ఈ కమిటీలోని నిపుణులు పరిశీలించి ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీకి సిఫార్సులు చేస్తారు. కమిటీ సిఫార్సుల ఆధారంగా ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలా వద్దా అన్నది అథారిటీ నిర్ణయిస్తుంది. గనులు, ఫార్మా కంపెనీలు సహా అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు తప్పనిసరి. ఖమ్మం జిల్లా వైరా ప్రాంతవాసి డా. సరిత సజ్జాకు పర్యావరణ నిపుణుల కమిటీలో సభ్యురాలిగా చోటు లభించింది
