వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ‌లో 5,348 పోస్టుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్

తెలంగాణ‌లో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ‌లోని 5,348 పోస్టుల భ‌ర్తీకి స‌ర్కార్ ప‌చ్చ‌జెండా ఊపింది. ఈ మేర‌కు ఈ నెల 16వ తేదీనే ఆర్థిక శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి జీవో విడుద‌ల చేశారు. ప్ర‌జారోగ్యం, ఆయుష్‌, డీసీఏ, ఐపీఎం, డీఎంఈ, వైద్య విధాన ప‌రిష‌త్‌, ఎంఎన్‌జే క్యాన్స‌ర్ ఆస్ప‌త్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు అనుమ‌తులు జారీ చేశారు. ఈ నియామ‌కాల‌ను వైద్యారోగ్య స‌ర్వీసుల నియామ‌క బోర్డు ద్వారా నేరుగా చేప‌ట్ట‌నున్నారు. ఇందుకోసం స్థానిక‌త ఆధారంగా ఉన్న ఖాళీలు, రోస్ట‌ర్ పాయింట్లు, అర్హ‌త‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఆయా విభాగాల అధిప‌తుల నుంచి తీసుకోవాల‌ని చెప్పారు. ఆయా వివరాల ఆధారంగా నోటిఫికేష‌న్ ఇచ్చి నేరుగా ఖాళీల‌ను భ‌ర్తీ చేయాల‌ని తెలిపారు.