వైద్య విద్యా ఇన్‌చార్జి డైరెక్టర్‌ వాణి నియామకాన్ని సస్పెండ్‌ చేసిన హైకోర్టు..

 తెలంగాణ వైద్య విద్య ఇన్‌చార్జి డైరెక్టర్‌గా డాక్టర్‌ ఎన్‌ వాణిని ఇటీవల ప్రభుత్వం నియమించింది. ఆమె నియామకాన్ని రాష్ట్ర హైకోర్టు సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డీఎంఈగా వాణిని నియమించడాన్ని ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ నరేందర్‌ కుమార్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. జూనియర్‌ను ఇన్‌చార్జిగా నియమించారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. నరేందర్‌ వాదనలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నియామకాన్ని సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

శాశ్వత ప్రాతిపదికన డీఎంఈ పోస్టు భర్తీ చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదిలా ఉండగా.. వైద్య విద్యాశాఖ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా వాణిని ప్రభుత్వం గత నెలలో నియమించింది. ఆమె సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమెను డీఎంఈగా సర్కారు బాధ్యతలు అప్పగించింది. ఇంతకు ముందు డీఎంఈగా డాక్టర్‌ త్రివేణి కొనసాగారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వాణి ఇన్‌చార్జి బాధ్యతల్లో కొనసాగుతారని ప్రభుత్వం పేర్కొంది.