సీఎం రేవంత్ సర్కార్ కాకతీయ తోరణాన్ని ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్నిగుండం అవుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. కాకతీయ తోరణం వరంగల్ జిల్లా ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని హరీశ్‌రావు పేర్కొన్నారు. వరంగల్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
వరంగల్‌లో వెయ్యి పడకల ఆస్పత్రికి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మహబూబాబాద్, జనగామ, ములుగు, నర్సంపేట, భూపాలపల్లికి మెడికల్ కాలేజీలు ఇచ్చింది కేసీఆర్ అని హరీశ్‌రావు గుర్తు చేశారు. అంతేకాకుండా వరంగల్ జిల్లాకు టెక్స్ టైల్ పార్కు, వెటర్నరీ యూనివర్సిటీ ఇచ్చాం. ఇవాళ రేవంత్ తెలంగాణ చిహ్నంలోని కాకతీయ తోరణం తీసేస్తా అంటున్నాడు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని అంటున్నాడు. కాకతీయ తోరణాన్ని ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్ని గుండం అవుతుంది. కాకతీయ తోరణం వరంగల్ జిల్లా ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. ఒక వేళ ఆ చిహ్నంలో కాకతీయ తోరణం తొలగిస్తే కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా భూస్థాపితం చేస్తారు వరంగల్ జిల్లా ప్రజలు. రేవంత్ రెడ్డి ఏదో ఒక రకంగా కేసీఆర్ మీద అపవాదులు వేయాలని చూస్తున్నారు అని హరీశ్‌రావు తెలిపారు.
కాంగ్రెస్ నాయకులు ఏదో ఉద్దరిస్తారు అనుకున్నారు.. కానీ అన్నీ ఉద్దెర మాటలే అన్నది ప్రజలు గుర్తించారు. ఈ వంద రోజుల్లో ఉద్దెర మాటలే తప్ప ఉద్దరించింది ఏం లేదు. అన్నీ ఫేక్, లీక్ వార్తలే. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. హామీలు అమలు కాలేదు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు కోపంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజస్వరూపం ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. మనం ప్రజలకు వద్దకు వెళ్లి వివరించాలి. నిన్న కేసీఆర్‌కు అద్భుతమైన ప్రజాస్పందన లభించింది. కడియం లాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, వారికి పార్టీ అండగా ఉంటుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.