ప్రకృతితో పరాచకాలొద్దు

  • అడవులను రక్షించుకోవాలి..
  • పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే మానవుడి మనుగడే ప్రశ్నార్థకం..
  • పరిశ్రమల కాలుష్యాన్ని అరికట్టాలి..

తమలపాకుతో నువ్వట్లంటే, తలుపు చెక్కతో నేన్నిట్లంటా అన్నట్లుగా వ్యవహరిస్తున్నది మానవాళితో ప్రకృతి. విశ్వవ్యాప్తంగా మానవ తప్పిదాల వల్లనే విపత్తులు ఒకదానివెంట ఒకటి తోసుకువస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా వాతావరణంలో ఊహించని మార్పులు వస్తున్నాయి. అయితే అతివృష్టి, లేకుంటే అనావృష్టి అన్నట్టుగా ప్రకృతి మానవునిపై పగబట్టి వ్యవహరిస్తున్నదేమోననిపిస్తున్నది. వాతావరణంలో వస్తున్న మార్పులతో అటు వ్యవసాయ రంగమే కాదు ఇటు సామాన్యుల జీవితాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఒకపక్క గుక్కెడు మంచినీటి కోసం అల్లాడుతుంటే మరొకపక్క అకాల వర్షాలు, వడగండ్లతో ప్రకృతి కొన్ని ప్రాంతాల్లో విరుచుకుపడుతున్నది. ఫలితంగా నోటికొచ్చిన పంట నీటిపాలైపోతున్నది. ఈసారి తెలుగు రాష్ట్రాలకు వడగాల్పుల ముప్పు ఉన్నదని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు జారీ చేయడంతోపాటు మరో పదహారు జిల్లాలకు పసుపురంగు హెచ్చరికలు విడుదల చేసింది. మార్చి చివరివారం నాటికే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో నలభైమూడు డిగ్రీల సెలిసియస్ చేరుకున్నది. ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు ఏస్థాయికి పోతాయోనని ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిస్థితులు ఇందుకు భిన్నంగా లేవు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులతో ఈ పరిస్థితులు ఏర్పడుతున్నట్లు వాతావరణ శాస్త్రజ్ఞులు స్పష్టం చేస్తున్నారు.

ఇందుకు ప్రధానంగా తప్పుపట్టాల్సింది. నిందించాల్సింది. మానవుడి పర్యావరణ విధ్వంసం చర్యలే ఈ బీభత్సానికి, విపత్తులకు కారణం అవుతున్నాయని ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే మానవుడి మనుగడే భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారుతున్నదని ఎందరో పర్యావరణ శాస్త్రజ్ఞులు, ప్రేమికులు దశాబ్దాల తరబడి పదేపదే చెబుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నా పట్టించుకునే నాధుడే లేకుండాపోయాడు. పర్యావరణాన్ని కాపాడడం అటుంచి తూట్లు పొడవడం దురదృష్టకరం. అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు చేపడుతున్న కొన్ని కార్యక్రమాలు పర్యావరణానికి కొన్ని చేటు చేస్తున్నాయి. ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు మొదలుపెడితే కొండను తొలచి ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణాలు, నగరీకరణ పేరుతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఎకరాలు సాగు భూములను జనావాసాలుగా మార్చ డం ఒకటేమిటి ఎన్ని విధాలుగా పర్యావరణానికి నష్టం చేయగలుగుతారో అన్నిమార్గాల్లో నిత్యం అన్వేషణ జరుగుతున్నది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం మరో పదేళ్లలో ఇండియా జనాభా నూట నలభై ఐదు కోట్లకు చేరుకుంటుందని, అందుకు తగినట్లుగా దేశంలోని సహజ వనరులపై ఒత్తిడి పెరుగుతున్నదని ప్రధానంగా అటవీ సంపద తరిగిపోతున్నదని స్పష్టం చేసింది. భారత్ లో రోజుకూ 330 ఎకరాలకుపైగా అటవీభూమి అదృశ్యమైపోతున్నదని ఐక్యరాజ్యసమితి నివేదికలో వెల్లడించింది. బొగ్గు గనులు, ధర్మల్ విద్యుత్ కేంద్రాలు, నదీలోయ ప్రాజెక్టుల కోసం యధేచ్ఛగా అడవులను నరికివేస్తున్నారు. ఇలాంటి కారణాలు ఎన్నో పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నాయి. ఇక ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించలేకపోతున్నారు. రోజురోజుకూ ఆ వినియోగం పెరిగిపోతున్నది. అందువల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. ఒక ప్లాస్టిక్ సంచి మట్టిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. కొన్ని ప్లాస్టిక్ వస్తువులను నిషేధించినా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ లాంటి వాడకం గూర్చి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు రెట్టింపు స్థాయిలో వాహన కాలుష్యంతోపాటు పరిశ్రమలు వదులుతున్న పొగ అన్నీ కలిపి వాయుకాలుష్యాన్ని విపరీతంగా పెంచుతున్నాయి. ఇలాంటి రకరకాల కారణాలతో భూమి ఉష్ణోగ్రత క్రమేపీ పెరుగుతున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే ఉష్ణోగ్రత పెరిగి ప్రపంచంలోని తీరప్రాంతాలు, దీవులతో సహా అనేక దేశాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఏనాటినుంచో పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు.

ఇలా ప్రకృతితో మనిషి ఆటలాడుకుంటుంటే అందుకు ప్రతికగా ప్రకృతి కూడా తీవ్రంగా స్పందిస్తున్నది. పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం కారణంగానే సకాలంలో వర్షాలు కురియకపోవడం, అకాలవర్షాలు ఒకే ప్రాంతంలో కుంభవృష్టివి లాంటివి పెరిగిపోతున్నాయి. అంతేకాదు వరదలు, తుఫాన్లు, భూకంపాలు లాంటి ఉపద్రవాలు మానవాళిపై దాడి చేయడం పెరిగి పోతున్నది. ప్రపంచవ్యాప్తంగా 380పైగా యేటా ఉపద్రవాలు సంభవిస్తున్నట్లు అధికార రికార్డులే వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యేటా లక్షలాదిమంది ఉపద్రవాలతో ప్రాణాలు వదులుతుంటే మరెందరో రోగపీడితులు అవుతున్నారు. ఇక ఆస్తుల నష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే పాలకులు తీసుకుంటున్న ముందుజాగ్రత్తల వల్ల ఇటీవల కాలంలో ప్రాణ, ఆస్తి నష్టాలను కొంతవరకు నియంత్రించగలుగుతున్నారు. కాని పర్యావరణ సమతుల్యం దెబ్బతిన్న కారణంగా విజృంభిస్తున్న ప్రకృతికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఏదిఏమైనా ఉపద్రవాల నియంత్రణకు పర్యావరణాన్ని కాపాడేందుకు త్రికరణశుద్ధిగా కృషిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కూడా అవగాహన పెంచాలి. ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భవిష్యత్ లో భారీ మూల్యం చెల్లించక తప్పదు. (సోర్స్: వార్త)