ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్‌ నిరాకరణ

మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కవిత బెయిల్‌ పిటిషన్‌ను రౌస్‌ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న కవిత.. తన కుమారుడి పరీక్ష నేపథ్యంలో బెయిల్‌ ఇవ్వాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 4 ఇరుపక్షాల వాదనలు ముగియగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ భవేజా నేడు తీర్పును వెలువరించారు.

కాగా, కవితకు కోర్టు విధించిన 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. నేడు మధ్యంతర బెయిల్‌ నిరాకరించడంతో రేపు మళ్లీ తీహార్‌ జైలు నుంచి కోర్టుకు హాజరుకానున్నారు. మరోవైపు కవిత సాధారణ బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 20న వాదనలు వింటామని కోర్టు ఇప్పటికే స్పష్టంచేసిన విషయం తెలిసిందే.