కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా టీఎన్‌ వంశా తిలక్

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉపఎన్నికకు బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. టీఎన్‌ వంశా తిలక్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యవర్గం ఓ ప్రకటనను విడుదలచేసింది. వంశా తిలక్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న నాలుగు అసెంబ్లీ ఉపఎన్నికలకు కూడా అభ్యర్థులను ప్రకటించింది. గత ఎన్నికల్లో కంటోన్మెంట్‌ నుంచి గెలుపొందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రెండు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. దీంతో కంటోన్మెంట్‌లో ఉపఎన్నిక అనివార్యమయింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దివంగత లాస్య నందిత సోదరి నివేదితను పార్టీ అధినేత కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా, గత ఎన్నికల్లో బీజేపీ తరఫున కంటోన్మెంట్‌ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేశ్‌ ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయననే తమ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. దీంతో మరో కొత్త అభ్యర్థిని బీజేపీ రంగంలోకి దించింది.