తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తన అనుచరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లిన ఆయన రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
కాగా కిషన్‌రెడ్డి ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్‌సభకు మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగా ఇవాళ తొలి విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది.
ఇక రెండో విడత, మూడో విడత లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్‌ల ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల నామినేషన్‌ల ప్రక్రియ మొదలైంది. నాలుగో విడతలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలతోపాటే మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. నాలుగో విడత లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 25 వరకు నామినేషన్‌ల ప్రక్రియ కొనసాగనుంది. అందులో భాగంగానే ఇవాళ కిషన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.