కేసీఆర్ బస్సు యాత్ర మరో రోజు పొడిగింపు

బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌స్సు యాత్ర మ‌రో రోజు పొడిగించారు. మే 11వ తేదీన ఉదయం 10 గంటలకు గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్డు షో నిర్వ‌హించ‌నున్నారు కేసీఆర్. ఆ రోడ్ షోతో కేసీఆర్ బస్సు యాత్ర ముగియ‌నుంది. షెడ్యూల్ ప్ర‌కారం 10వ తేదీన సిద్దిపేట‌లో బ‌స్సు యాత్ర ముగియాలి. బ‌స్సు యాత్ర ముగింపు సంద‌ర్భంగా సిద్దిపేట‌లో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని పార్టీ నిర్ణ‌యించింది. స‌భ ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి. అయితే మ‌రో రోజు బ‌స్సు యాత్ర‌ను పొడిగించింది బీఆర్ఎస్ పార్టీ. చివ‌రి రోజున గ‌జ్వేల్‌లో కేసీఆర్ ప‌ర్య‌టించ‌నున్నారు.

మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంటలకు కామారెడ్డిలోని జేపీ చౌక్‌ వద్ద కార్నర్‌ మీటింగ్‌లో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం రాత్రి 8 గంటలకు బీఆర్‌ఎస్‌ కంచుకోట మెదక్‌లోని రాందాస్‌ కూడలిలో నిర్వహించనున్న రోడ్‌షోలో పాల్గొనున్నారు. కాగా, పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా ఏప్రిల్‌ 24న కేసీఆర్‌ బస్సు యాత్ర ప్రారంభించిన విషయం విదితమే. అధినేత బస్సుయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది.