ప్రజారోగ్యానికి కాలుష్యపు కాటు

కాలుష్య నివారణకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరణ యోగ్యం కాని విధానాలతో ప్రయోగాలు చేస్తూ రోజు రోజుకు సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా పాలకులు కాలుష్య నివారణకు రూపొందిస్తున్న చట్టాలు, నిబంధనలను త్రికరణశుద్ధిగా అమలు చేయకపోవడంతో పర్యావరణం విషతుల్యంగా మారుతుంది. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది రకరకాల వ్యాధులకు లోనవుతున్నారు. మరెందరో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి మంచానికే పరిమితమై కృంగికృశించి అసువులు బాస్తున్నారు. అంతకంతకు కాలుష్య మేఘాలు కమ్ముకోవడం ఆందోళన కలిగించే అంశం. ప్రధానంగా దేశంలోని అనేక నగరాలు ఈ కాలుష్య కాసారంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అదుపు తప్పిపోతున్నది. శీతాకాలంలో పరిస్థితి విష మించడం పాఠశాలలకు సెలవులు ప్రకటించే పరిస్థితులు దాపురించాయి. ఒక్క ఢిల్లీలోనే కాదు ముఖ్యంగా హైదరాబాద్, బెంగూళూర్ లాంటి దేశంలోని అనేక నగరాల్లో కాలుష్య పరిస్థితి ప్రమాదకరస్థాయికి చేరుకుంటుందనే వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా కోల్ కతా, ముంబాయి నగరాలతోపాటు దక్షిణాదిన బెంగళూరు, హైదరాబాద్ చెన్నైలలో వాయునాణ్యత క్షీణిస్తున్నది. ఢిల్లీకి పొరుగునున్న హర్యానా, పంజాబ్, రాజస్థాన్ లో కూడా రోగధూళి విస్తరిస్తుందనే వార్తలు కలవరపెడుతున్నాయి. దేశంలో ఆరు మెట్రోనగరాలు ముంబాయి, బెంగళూరు, కోల్ కతా, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నైలలో జరిపిన సర్వేల్లో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. పర్యావరణం, నీటి, గాలి నాణ్యత వాతావరణంలో మార్పులు, అటవీ విస్తీర్ణం, చెత్త నిర్వహణ తదితర అంశాలపై జరిపిన సర్వేలో వాయు కాలుష్యం నగర జీవి ఊపిరితిత్తులకు తూట్లు పొడుస్తుందన్న విషయం వెలుగు చూసింది. కొన్ని నగరాల్లో వాయుకాలుష్యం తీవ్రంగా ఉంటే మరికొన్ని నగరాల్లో దీనికి పారిశ్రామిక కాలుష్యం తోడవుతున్నది. హైదరాబాద్ నగరంలో నీటి, వాయు కాలుష్యంతోపాటు నిర్మాణ రంగంవల్ల పీల్చే గాలిలో ధూళికణాలు, పారిశ్రామిక కాలుష్యం అధికంగా ఉన్నట్లు బయటపడింది. ఇక గ్రామాల నుండి నగరాలకు వలసలు పెరిగిపోవడం ఒక క్రమపద్ధతి, ప్రణాళిక లేకుండా ఎక్కడ పడితే అక్కడ కాలనీలు వెలుస్తున్నాయి. మురికివాడల నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నా పెరుగుతున్న ఈ కాలనీలకు అనుగుణంగా చర్యలు చేపట్టలేకపోతున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అంతగా సఫలీకృతం కావడం లేదు. 2019లో భారత్ లో ఎంపిక చేసిన 102 నగరాల్లో ధూళి కణాల ముప్పును ఇరవై శాతం నుండి ముప్పైకి తగ్గించడాన్ని జాతీయ వాయుశుద్ధి కార్యక్రమం ప్రారంభించారు. ఆ తర్వాత క్రమేపీ మరో ఇరవై నగరాలకు విస్తరించారు. 2025- 26 నాటికి సూక్ష్మకణాలను నలభైశాతం దాకా నియంత్రిస్తామంటూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాదాపు ఏడువేల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించినా పరిస్థితుల్లో పెద్ద మార్పు రాలేదు. పంజాబ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, యుపి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో నిబంధనలను పట్టించుకోవడం లేదు. అంతర్జాతీయంగా ముఖ్యంగా చైనా, అమెరికా లాంటి దేశాలు వాయుకాలుష్యాన్ని నియంత్రించడంలో సఫలీకృతం అవుతున్నట్లు అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కాలుష్యాలకు మూలమైన దాదాపు ఐదు వందలకు పైగా కార్ల మోడళ్లను నిషేధించి ప్రజారవాణా వ్యవస్థను కాలుష్యరహితంగా మార్చేందుకు చైనా తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. బొగ్గు ఆధారిత విద్యుత్ కర్మాగారాల నిర్మాణాలకు దాదాపు ఫుల్ స్టాప్ పెట్టించింది. అడవుల సంరక్షణకు ప్రత్యేక దృష్టి సారించారు. మనదేశంలో పర్యావరణాన్ని కాలుష్యం చేస్తూ మోతాదుకు మించిన పొగను వదులుతున్న వాహనాల సంఖ్య కోట్లల్లో ఉండొచ్చు. వాటిని నియంత్రించేందుకు ఎన్నో చట్టాలు తీసుకువచ్చారు. నిబంధనలు విధించారు. జరిమానాలు వేస్తున్నారు. అన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా వాతావరణంలో కార్బన్ మోనాక్సై డ్, నైట్రిక్ ఆక్సైడ్, దుమ్ముధూళి పెరిగిపోతున్నది. పెట్రోల్, డీజిల్ లో జరుగుతున్న కల్తీ ఈ కాలుష్యాన్ని మరింత పెంచుతున్నది. కల్తీని నిరోధించేందుకు అధికారగణం తీసుకుంటున్న చర్యలు ఫలితాలను ఇవ్వడం లేదు. మొత్తం మీద తీవ్రస్థాయిలో వెలువడుతున్న విషవాయువుల వల్ల పర్యావరణం విషతుల్యమై దేశంలో కోట్లాది మంది ప్రజలు రకరకాల వ్యాధులకు లోనవుతున్నారు. దీనికి తోడు నీటి కాలుష్యం కూడా ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. గతంలో ఒక విశ్వవిద్యా లయం పర్యావరణ పరిశోధన శాస్త్రజ్ఞులు చేసిన అధ్యయనంలో 132 దేశాల కంటే భారత్ అట్టడుగునున్నట్లు వెల్లడయింది. భారత్ లో ధూళికణాలు ఉండాల్సిన స్థాయి కన్నా ఐదురెట్లు అధికంగా ఉండి శ్వాసకోశ సమస్యల నుంచి కేన్సర్ దాకా అనేక వ్యాధులకు కారణాలవుతున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. ప్రత్యేకించి భావితరం బాలికల బతుకు దీపాలను కాలుష్యం చిదిమేస్తున్నట్లు బయటపడింది. వాయుకాలుష్యం మంచి కొలెస్ట్రాల్ను చెడు కొలెస్ట్రాల్గా మారుస్తూ గుండెజబ్బులకు కారణమవుతూ పక్షవాతానికి, ఊపిరితిత్తులకు, కేన్సర్ కు మూలం అవుతుందనే విషయాన్ని పరిశోధన వెల్లడించింది. సమస్య తీవ్రతను ఇప్పటికైనా పాలకులు గుర్తించి నివారణకు ఆచరణయోగ్యమైన విధానాలు ప్రకటించడమేకాక అమలుకు త్రికరణశుద్ధిగా కృషి చేయాలి.