2 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చిన‌ప్ప‌టికీ.. నిరుద్యోగుల‌కు దూర‌మ‌య్యాం : కేటీఆర్

ప‌దేండ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో ప్ర‌భుత్వ రంగంలో 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చాం.. ప్ర‌యివేటు రంగంలో 24 ల‌క్ష‌ల మందికి ఉపాధి క‌ల్పించాం. అయిన‌ప్ప‌టికీ నిరుద్యోగుల‌కు, యువ‌త‌కు దూరం అయ్యామ‌ని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇల్లందు నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో కేటీఆర్ పాల్గొని బీఆర్ఎస్ అభ్య‌ర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డికి మ‌ద్ద‌తుగా ప్ర‌సంగించారు.

ఐదారు నెల‌ల కింద‌ట కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల‌ని ఊద‌ర‌గొట్టింది. మొత్తానికి అర‌చేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వ‌చ్చింది. అధికారం కోల్పోయినందుకు బాధ‌లేదు. అధికారం శాశ్వ‌తం కాదు. మార్పు అని ఓటేసిన పాపానికి.. గ‌త ప్ర‌భుత్వంలో ఏం జ‌రిగింది..? ఈ ప్ర‌భుత్వంలో ఏం జ‌రుగుతుంది..? అనేది తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌వుతుంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

నిరుద్యోగులు, యువ‌త‌కు మేం దూర‌మ‌య్యాం. గ‌త ప‌దేండ్ల‌లో దేశంలో ఎక్క‌డా చేయ‌ని విధంగా ఉపాధి క‌ల్ప‌న క‌ల్పించాం. 2014 నుంచి 2024 వ‌ర‌కు కేసీఆర్ ప్ర‌భుత్వం 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చింది. ఏ డిపార్ట్‌మెంట్‌లో ఎన్ని ఉద్యోగ నియ‌మాకాలు జ‌రిగాయో లెక్క‌ల‌తో స‌హా మీ ముందు పెడుతాం. ఈ దేశంలో ఇంత‌కంటే గొప్ప‌గా ఉపాధి క‌ల్ప‌న జ‌ర‌గ‌లేదు. మీరేన్ని ఉద్యోగాలు భ‌ర్తీ చేశారో చెప్పండి అని అడిగితే కాంగ్రెస్, బీజేపీ నాయ‌కుల వ‌ద్ద‌ స‌మాధానం లేదు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఉద్యోగాల భ‌ర్తీ చేసిన‌ప్ప‌టికీ ఈ ప్ర‌భుత్వం ప‌ని చ‌య‌లేద‌ని సోష‌ల్ మీడియాలో దుష్ప్ర‌చారం జ‌రిగింది. చదువుకున్న యువ‌త ఈ వాద‌న‌కు ఆక‌ర్షితులై మాకు దూర‌మ‌య్యారు. ద‌య‌చేసి వాస్త‌వాల‌ను తెలుసుకోవాల‌ని మ‌న‌వి. మేం ఉద్యోగాలు క‌ల్పించిన విష‌యాన్ని మేం ప్ర‌చారం చేసుకోలేదు. అది మా త‌ప్పు. ప్ర‌తి ఒక్క‌రికి ప్ర‌భుత్వం ఉద్యోగం రాదు కాబ‌ట్టి ప్ర‌యివేటు రంగంలో ఉద్యోగాలు క‌ల్పించాం. ప్ర‌యివేటు రంగంలో పెట్టుబ‌డులు తీసుకొచ్చి ఉద్యోగాలు క‌ల్పించాం. దాదాపు 24 ల‌క్ష‌ల మందికి ఉపాధి అవ‌కాశాలు సృష్టించాం. హైద‌రాబాద్‌తో పాటు జిల్లాల్లో ఉపాధి క‌ల్ప‌న‌కు ప్ర‌య‌త్నం చేశామ‌ని కేటీఆర్ తెలిపారు.

మ‌హ‌బూబాబాద్ జిల్లాను చేయ‌డ‌మే కాకుండా మెడిక‌ల్ కాలేజీ, న‌ర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేశాం. వైద్య విద్య చ‌ద‌వే అవ‌కాశం దొరికింది. కొత్త‌గూడెంలో కూడా మెడిక‌ల్, న‌ర్సింగ్ కాలేజీ, ఖ‌మ్మంలో మెడిక‌ల్ కాలేజీ ఏర్పాటు చేసిన ఘ‌న‌త కేసీఆర్‌దే. 65 ఏండ్ల‌లో తెలంగాణ‌లో ఏర్పాటైంది 3 మెడిక‌ల్ కాలేజీలు మాత్ర‌మే. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత కేసీఆర్ నాయ‌క‌త్వంలో 33 మెడిక‌ల్, న‌ర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశాం. విద్యావ్యాప్తి, ఉపాధి క‌ల్ప‌న‌కు, ప్ర‌యివేటు రంగంలో పెట్ట‌బ‌డుల‌కు, ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి కృషి చేశామ‌ని కేటీఆర్ తెలిపారు.