ఆగని పారిశ్రామిక ప్రమాదాలు

  • చర్యలు చేపట్టని అధికారులు

పరిశ్రమల ఏర్పాటులో నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు సక్రమంగా పాటించడం లేదు. దీంతో వాటి పరిసర ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. మూడు రోజుల క్రితం తాండూరు మండలం గుంతబాస్పల్లి శివారులోని రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. అయినా అధికారులు నివారణ చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నింగి, నేలా, నీరూ కలుషితం :
తాండూరు మండలం గుంతబాస్పల్లి శివారులో నిబంధనలకు విరుద్ధంగా ఇండస్ కెమ్ హజార్ డోస్ పరిశ్రమను రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. దీనికి ట్యాంకర్లు, లారీల్లో హైదరాబాద్, పటాన్ చెరు, బొల్లారం, కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతాల్లోని పరిశ్రమలు, పార్మా కర్మాగారాల నుంచి వెలువడ్డ ఘన, ద్రవ రసాయన వ్యర్ధాలను తరలించి ముడిసరకు తయారు చేసే వారు. తద్వారా స్థానికంగా నింగి, నేలా, నీరూ కలుషితమై ప్రజలు అనారోగ్యం పాలయ్యారు. గుంతబాస్పల్లి, మిట్టబాస్పల్లి, మల్కాపూర్ గ్రామస్థులు గతేడాది పరిశ్రమను ఇక్కడ నుంచి తరలించాలని ఆందోళన చేశారు. చివరకు అధికారులు పరిశ్రమను ఆరు నెలల క్రితం మూసివేయించి సీలు వేశారు.

తిరిగి తెరిచిన కొన్నాళ్లకే..:
ఇటీవల పరిశ్రమను తెరిచి కాలుష్య కార్యకలాపాలను ప్రారంభించారు. రెండు రోజుల క్రితం పరిశ్రమలో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. పైకప్పు కూలిపోయింది. పెద్దఎత్తున పొగలు వెలువడటంతో మల్కాపూర్, గుంతబాస్పల్లి, మిట్టబాస్పల్లి గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. గతేడాది ఫిబ్రవరిలోనూ రసాయన వ్యర్ధాల డ్రమ్ములు పేలి అగ్నిప్రమాదం జరిగింది. ఏడాదిన్నరలో రెండుసార్లు అగ్ని ప్రమాదాలు జరగడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. నిబంధనల ప్రకారం పరిశ్రమను గ్రామాలకు నాలుగు కి.మీ. దూరంలో ఏర్పాటు చేయాల్సి ఉండగా కి. మీ. దూరంలోనే నెలకొల్పి ప్రాణాల మీదకు తెస్తున్నారని వాపోతున్నారు.

ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించాం :
ఇండస్ కెమ్ హజార్ డోస్ పరిశ్రమపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో మూసివేయించాం. ఇటీవల మళ్లీ తెరిచాక మండే స్వభావం కల్గిన ద్రవ, ఘన రూప వ్యర్థాలను నిల్వ చేయడంతో అగ్ని ప్రమాదం జరిగింది. దీనిపై సనత్ నగర్ కార్యాలయంలోని ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించాం. మరోసారి పరిశ్రమను పరిశీలించి చర్యలు చేపడతాం. – సిద్ధార్థ, ఎఇఇ, కాలుష్య నియంత్రణ మండలి. (సోర్స్ : ఈనాడు)