తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అవినీతికి ఆస్కారం లేదు : టీఆర్‌ఎస్‌ ఎంపీలు

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అవినీతి ఉందని బీజేపీ నాయకులు ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య అని టీఆర్‌ఎస్‌ ఎంపీలు మండిపడ్డారు. ఇవాళ టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. లక్షల మంది పేదల పొట్ట కొట్టేందుకు అవాస్తవాలు ప్రచారం చేస్తారా? అని బీజేపీ నేతలపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా మెచ్చుకుంటున్నారని ఎంపీలు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాలన పారదర్శకంగా ఉందని స్పష్టం చేశారు. అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఎంపీలు తేల్చిచెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను ఆపాలని బీజేపీ ఎంపీలు చూస్తున్నారని తెలిపారు. షాదీముబారక్‌, కళ్యాణలక్ష్మి పథకాలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ పథకాల ద్వారా ఆధార్‌ డేటా తీసుకుంటున్నామని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. షాదీ ముబారక్‌, కళ్యాణలక్ష్మిలో ఎలాంటి మోసాల్లేవని కేంద్రం సమాధానం చెప్పిందని ఎంపీలు గుర్తు చేశారు. సంక్షేమ పథకాల్లో అవినీతికి ఆస్కారం లేకుండా ఆధార్‌ను పెట్టామని స్పష్టం చేశారు. తెలంగాణ సంక్షేమ పథకాల్లో అవినీతికి ఆస్కారం లేదన్నారు టీఆర్‌ఎస్‌ ఎంపీలు.