ఛత్తీస్‌గఢ్‌ ఫ్యాక్టరీలో పేలుడు ఘటన.. ఆరుగురు గాయపడ్డారన్న ఎస్పీ

 ఛత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం జరిగిన పేలుడులో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని, ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని బెమెతారా జిల్లా ఎస్పీ రామకృష్ణ సాహూ చెప్పారు. బెమెతారా జిల్లా బెర్లా బ్లాక్‌లోని బోర్సీ గ్రామంలోగల గన్‌పౌడర్‌ తయారీ పరిశ్రమలో శనివారం ఉదయం పేలుడు సంభవించింది.

ఈ పేలుడు ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారని, పలువురు తీవ్రంగా గాయపడ్డారని ముందుగా ప్రచారం జరిగింది. కానీ వాస్తవానికి ఎవరూ ప్రాణాలు కోల్పేదని ఎస్పీ తెలిపారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయని అన్నారు. పేలుడు ధాటికి భవనం కూలిపోయిందని, శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది తెలుసుకునేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాగా ఘటనపై ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణు దేవ్‌ సాయి విచారం వ్యక్తంచేశారు.