- అక్రమాస్తులపై నిఘా… మారువేషాల్లో సోదాలు
- అడ్డంగా దొరికిపోతున్న అవినీతి తిమింగలాలు
- మూడు నెలల్లో 73 కేసులు నమోదు… అరెస్టు
- మున్సిపల్, రెవిన్యూ, పోలీసు శాఖల్లోనే అత్యధికం
- అవినీతి కట్టడిపై ఏసీబీ డీజీ ఆనంద్ స్పెషల్ ఫోకస్
- నిత్యం డీఎస్పీలతో సమీక్షలు… తనిఖీలకు ఆదేశం
- అమ్యామ్యాల భరతం పడుతున్న ఏసీబీ అధికారులు
తెలంగాణ రాష్ట్రంలో అన్ని శాఖలలో అవినీతిని బట్టబయలు చేసేందుకు ఏసీబీ(ACB) దూకుడు పెంచింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా సీవీ అనంద్ బాధ్యతలు చేపట్టాక తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఆయన నిత్యం జిల్లాల్లోని ఏసీబీ డీఎస్పీలతో మాట్లాడుతుండడం, సమీక్షలు నిర్వహిస్తుండడంతో వారు సైతం దూకుడు పెంచారు. గడచిన మూడు నెలల కాలంలో 73 మంది అవినీతి పరులు అడ్డంగా పట్టుబడటంతో వారికి అరదండాలు వేసి జైళ్లకు తరలించారు. అవినీతి నిరోధక శాఖలో అన్ని శాఖలలోని అవినీతి అధికారులపై ఫోకస్ పెట్టింది. ఇటీవల కాలంలో ఏసీబీకి పట్టుబడుతున్న వారిలో అత్యధిక శాతం పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులున్నారు. కాగా గత మూడు నెలల కాలంలో ఇప్పటి వరకు జరిగిన ఏసీబీ ట్రాప్స్, అక్రమాస్తుల కేసుల్లో దొరికిన ఆఫీసర్ల లెక్కల ప్రకారం మున్సిపల్, రెవెన్యూ శాఖలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని ఏసీబీ వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యవసాయ భూములు, ఇండ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు, మున్సిపాలిటీల్లో బిల్డింగ్ నిర్మాణ అనుమతుల నుంచి బర్త్, డెత్, ఫ్యామిలీ మెంబర్ తదితర సర్టిఫికెట్ల మంజూరు వరకు ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్నారని గుర్తించారు.
మారువేషాలలో…
తాజాగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ మెరుపు దాడులు నిర్వహించింది. ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు లంచం తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా మారు వేషంలో వెళ్లి అవినీతిపరుల భరతం పడుతున్నారు. ఏసీబీ అధికారులు లారీ డ్రైవర్లుగా అశ్వారావుపేట చెకోపోస్టు వెళ్లారు. ఈక్ర మంలో ఆర్టీఏ చెక్ పోస్టు అధికారులు మారు వేషంలో ఉన్న ఏసీబీ అధికారులను లంచం డిమాండ్ చేశారు. ఒక్కో వాహనానికి అనధికారికంగా రూ.100 వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణ, ఏపీ సరిహద్దు చెకోపోస్టు కావడంతో అధికారుల చేతివాటం చూపిస్తు న్నారు. ఏసీబీ సీక్రెట్ ఆపరేషన్లో బాగోతం బయట పడింది. ఇక రంగారెడ్డి, ఆదిలాబాద్ పాటు నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో భారీగా అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తిం చారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పలు చెక్పోస్ట్లలో లెక్క లలోకి రాని నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఆదాయానికి మించి ఆస్తులు
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ, గిరిజన సంక్షేమ శాఖ అధికారి జగజ్యోతి, ములుగు ప్రభుత్వ అధికారి తస్లీమా, తహసీల్దార్ రజిని, సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావులపై ఆదాయానికి మించిన ఆస్తులు కేసులు నమోదయ్యాయి. ఇదిలావుండగా ఒకే రోజు ముగ్గురు అధికారులను ట్రాప్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. ఒకే రోజు ఎస్ఐ, అసిస్టెంట్ డైరెక్టర్, ఆర్టీసీ డీఎంలను ట్రాప్ చేసి రిమాండుకు తరలించింది. తెలంగాణలో ప్రతి నాలుగు రోజులకు ఒక ట్రాప్ కేసు నమోదవడం గమనార్హం. వీటితోపాటు గొర్రెల స్కాం, హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ అధికారుల అక్రమాలపై ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసిన విషయం విదితమే.
మూడు నెలల్లో ముఖ్యమైన కేసులు
ప్రతి మూడు రోజులకు ఒక ట్రాప్ కేసు నమోదు అవుతున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ జమ్మికుంట మాజీ తహసీల్దార్ రజిని అక్రమాస్తుల కేసు, గొర్రెల పంపిణీ స్కీమ్ లో కోట్లాది రూపాయల నిధుల మళ్లింపు గత మూడు నెలల్లోనే జరిగాయి.
గొర్రెల పంపిణీ స్కామ్ పై ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేసి కామారెడ్డి వెటర్నరీ దవాఖాన అసిస్టెంట్ డైరెక్టర్ రవి, మేడ్చల్ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య, రంగారెడ్డి జిల్లా భూగర్భజల అధికారి రఘుపతిరెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ గణేశ్ ను అరెస్టు చేశారు. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై నకిలీ పత్రాలు, బ్యాంక్ అకౌంట్లు సృష్టించి సుమారు రూ.2.10 కోట్ల ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారని ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది.
తిమింగలాలపై నిఘా
ఏసీబీ నిర్వహించిన దాడుల్లో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు సంచలనం సృష్టించింది. అతడికి బినామీల పేరిటే 214 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, అత్యధికంగా జనగామ జిల్లాలో 102 ఎకరాలు, నాగర్ కర్నూల్ జిల్లాలో 39, సిద్దిపేట జిల్లాలో 7, యాదాద్రి జిల్లాలో 66 ఎకరాల వ్యవసాయ భూములు న్నట్లు తేలింది. అలాగే అతడి పేరిట మొత్తం 29 ఇండ్ల స్థలాలుండగా ఏపీలోని విశాఖపట్నం, విజయనగరంలో కూడా స్థలాలున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం శివబాలకృష్ణ ఉంటున్న విల్లాతో పాటు హైదరాబాద్లో 4, రంగారెడ్డి జిల్లాలో 3 అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు ఉన్నట్టు విచారణలో వెల్లడైంది. మొత్తంగా బహిరంగ మార్కెట్లో ఆయన ఆస్తుల విలువ రూ.వెయ్యి కోట్ల పైమాటేనని తెలుస్తోంది. అలాగే ఓ ఎమ్మెల్యేకు బంధువైన జమ్మికుంట మాజీ తహసీల్దార్ రజిని గత సర్కార్ హయాంలో వందల కోట్ల ఆస్తులు కూడబెట్టిందనే ఆరోపణలున్నాయి. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో అధికారులు ఆమె ఇంటితోపాటు బినామీలు, బంధువులకు చెందిన ఐదు ఇండ్లలో ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ సందర్బంగా ఆమె ఇంట్లో రూ.3.20 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువే రూ.20 కోట్లు ఉంటుందని అంచనా. ఆమె బినామీగా భావిస్తున్న వ్యక్తి పేరిట ధర్మసాగర్ మండలంలో ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఏడు ఎకరాల్లో వెంచర్ వేసినట్లు గుర్తించారు. ఇందులో ఇంకా ప్లాట్లు అమ్మలేదని, వీటి విలువ రూ.70 కోట్లవరకు ఉంటుందని తెలిసింది. అలాగే తాజాగా సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అక్రమాస్తులపై కేసు నమోదు చేశారు. పోలీసుశాఖలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలున్న ఆయన దాదాపు రూ.50 కోట్ల మేరకు అక్రమాస్తులున్నట్లు ఏసీబీ గుర్తించింది.(సోర్స్ : AP)