లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ కుషాయిగూడ సీఐ, ఎస్సై

హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ సీఐ వీరాస్వామి, ఎస్సై షఫీ ఏసీబీకి చిక్కారు. ఒక కేసుకు సంబంధించి రూ.3 లక్షలు తీసుకుంటుండగా వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

భూవివాదానికి సంబంధించిన ఓ కేసు సెటిల్‌మెంట్‌ చేయడానికి కుషాయిగూడ ఎస్సై, సీఐ లంచం డిమాండ్‌ చేశారు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌ వేసుకున్నారు. ఈ క్రమంలో కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా సీఐ వీరాస్వామి, ఎస్సై షఫీ, ఓ కానిస్టేబుల్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌లోనే విచారిస్తున్నారు. దాదాపు రెండు గంటలుగా కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఏసీబీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.