సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి భారీ షాక్ తగలింది. 175 అసెంబ్లీ సీట్లకు 175 సీట్లు గెలుస్తామన్న వైఎస్ జగన్ అంచనాలు తలకిందులయ్యాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం కేవలం 12 సీట్ల వద్దనే వైసీపీ ఆగిపోయింది. వీటిలో కూడా ఒకటి రెండు సీట్లు కూడా ఎన్డీయే కూటమికే వెళ్లిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే 8 జిల్లాల్లో వైసీపీ ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది.
ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఈసారి వైసీపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. వీటితో పాటు కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో ఖాతా తెరవలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభ్యర్థులను ప్రకటించే ముందు వైఎస్ జగన్ భారీ కసరత్తే చేశారు. దాదాపు 80కి పైగా సీట్లలో అభ్యర్థుల స్థానాలను మార్చారు. కానీ ఆ స్ట్రాటజీ ఏవీ వర్కవుట్ కాలేదు. అసెంబ్లీ స్థానాలు మార్చిన అందరూ ఓడిపోవడం గమనార్హం.