సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మరోసారి అధికార ఎన్డీఏనే విజయం వరించింది. అయితే విజయం ఎన్డీఏదే అయినా గత ఎన్నికలతో పోల్చుకుంటే ఆ కూటమి బాగా నష్టపోయింది. ప్రతిపక్ష ఇండియా కూటమి మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. అయితే ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి మధ్య సీట్ల తేడా కేవలం 60 సీట్లే కావడంతో.. ఎన్డీఏ కూటమిలోని కీలక భాగస్వాములైన జేడీయూ, టీడీపీలను ఇండియా కూటమివైపు మల్చుకుంటారా..? అనే చర్చ జోరుగా సాగుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో 16 లోక్‌సభ స్థానాలు గెలిచిన టీడీపీ, బీహార్‌లో 14 స్థానాలు దక్కించుకున్న జేడీయూను ఇండియా కూటమివైపు తిప్పుకుంటే ఆ కూటమికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం దక్కుతుందంటూ విశ్లేషణలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో జేడీయూ చీఫ్ నితీశ్‌కుమార్‌ను, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడును మీవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారా..? అని మీడియా అడిగిన ప్రశ్నకు రాహుల్‌గాంధీ సమాధానం ఇచ్చారు.
ఎన్నికల ఫలితాలపై ఏం చేయాలనే విషయంలో రేపు (బుధవారం) ఇండియా కూటమి సమావేశమై చర్చిస్తుందని రాహుల్‌గాంధీ అన్నారు. ఆ సమావేశంలోనే వాళ్లతో (నితీశ్‌కుమార్, చంద్రబాబు నాయుడు) మాట్లాడే విషయంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యవస్థలపై, నిఘా సంస్థలపై తాము చేసిన యుద్ధంగా భావిస్తామని చెప్పారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే ఈ యుద్ధం చేశామని రాహుల్‌గాంధీ తెలిపారు. ఎన్నికలకు ముందు మా పార్టీకి సంబంధించిన బ్యాంకు అకౌంట్లు అన్నింటిని సీజ్ చేశారని, కాంగ్రెస్ పార్టీ సీఎంలను జైలుకు పంపారని ఆయన విమర్శించారు. అయినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు అద్భుతంగా పోరాడారని కొనియాడారు.
బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని, రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ప్రతీ కార్యకర్త పోరాటం చేశారని రాహుల్‌గాంధీ అన్నారు. ఎన్నికల్లో బీజేపీతో పాటు అనేక సంస్థలతో పోరాడామని తెలిపారు. ఇండియా కూటమి ఐక్యంగా కలిసి పని చేసిందని, ఈ కూటమి కొత్త విజన్ ఇచ్చిందని పేర్కొన్నారు.