ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా..
పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుటకు మరియు పర్యావరణ సమతుల్యత కాపాడుటకు ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ జరుపుకుంటాము. పర్యా వరణ పరిరక్షణ వేడుకలు ఈ సంవత్సరము సౌదీ అరేబియాలో ‘మనభూమి-మన భవిష్యత్తు’ (భూమి పునరుద్ధరణ ఎడారీ కరణ మరియు కరువును తట్టుకోవడం) అనే థీమ్ తో నిర్వహించబడుతున్నది. ఈ థీమ్ భూమి మరియు పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడానికి, రక్షించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి పేరిట జరుగుతున్న మానవ కార్యకలాపాలు పర్యావరణాన్ని అత్యంత దారుణంగా దెబ్బతీస్తున్నవి. పర్యావరణంపై యదేచ్చగా విధ్వంసకర దుశ్చర్యలకు పాల్పడితే అనూహ్య స్థాయిలో విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మానవుడు తన భౌతిక అవసరాల కొరకు తరతరాల ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడు. ఏ మనిషి ప్రకృతికి అతీతం కాదు. ఈ సృష్టి శాశ్వతం. ఈ సృష్టికి మనం అతిధులం మాత్రమే! ఉన్నన్ని రోజులు ప్రకృతిలోని అందాలను ఆస్వాదించి తర్వాతి తరానికి జాగ్రత్తగా అందించాలి. పర్యావరణాన్ని సంరక్షించుకోవడంలో ఏమాత్రం నిర్లక్ష్యం చూపిన అది జీవరాశి మనుగడకే పెనుముప్పుగా పరిణమించే ప్రమాదం కలదు. గాలి, నీరు, నేల, ఆకాశం, వృక్ష సంపదలతో పాటు సమస్త జీవరాశులను కాపాడుకోవాల్సిన అవసరం కలదు.
ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో కరోనా మనకు ప్రత్యక్షంగా చూపించింది. మానవుడు ప్రకృతిని జయించాలని చూస్తే ప్రకృతి తిరగబడి తన ఆధీనంలోకి తీసుకుంటుందనే సత్యము కరోనా విపత్తు మనకు ప్రత్యక్షంగా చూపించింది. అభివృద్ధి పేరిట మానవుడు విచక్షణారహితంగా అటవి సంపదను ధ్వంసం చేసి వర్షాభావ దుర్భర పరిస్థితిలను సృష్టిస్తున్నాడు. మన శరీరంలో ఊపిరితిత్తులు చేసే పనిని పర్యావరణానికి అడవులు చేస్తాయి. అడవులు లేకపోతే మానవ మనుగడే లేదు. అడవులు మనిషి సృష్టించే వాయు కాలుష్యాన్ని నియంత్రిస్తాయి. స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. నీటిచక్రాన్ని నడిపిస్తాయి. వరదల్ని అడ్డుకొని నేలకోతకు గురి కాకుండా చూస్తాయి. వేడిని గ్రహించి వాతావరణాన్ని చల్ల బరుస్తాయి. అడవుల్లో విభిన్నమైన చెట్ల జాతులు సమన్వయంతో పెరుగుతాయి. పలు రకాల జంతువులు, పక్షులు, క్రిమి కీటకాలు అడవిలో నివాసం ఉండడం వలన ఆహారపు గొలుసు నిరాటంకంగా కొనసాగుతుంది. అడవులు ఎంత ఎక్కువగా ఉంటే మనిషి ఆరోగ్యం అంతా చక్కగా ఉంటుం
దని చెప్పవచ్చు. భూతాపం నుంచి రక్షించే ఏకైక వనరు అడవి మాత్రమే. జీవవైవిద్యాన్ని, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంలో అడవులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ‘వృక్షో రక్షతి రక్షితః’ అనే సూక్తి అటవీ సంరక్షణకు మార్గదర్శకం కావాలి. అడవుల శాతం తగ్గిపోయి పట్టణీకరణ, నాగరికరణలు పెరుగుతుండడం వలన వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తున్నవి. 60 శాతం వేడిమికి నగరీకరణ కారణమని చెప్పవచ్చు. జనాభా పెరుగుదలతో పాటు చెట్లు నరికి వేయడం, పచ్చదనాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం వలన భూతాపం విపరీతంగా పెరుగుతున్నది. భూతాపం పెరగడమనేది యావత్ ప్రపంచానికి అతిపెద్ద ప్రమాద హెచ్చరిక. వడదెబ్బకు ఒక్క ఈ మే నెలలోనే దేశవ్యాప్తంగా సుమారు 80 మందికి పైగా మృతి చెందారు.
ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పులతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరిగిన ప్రపంచ జీడిపి క్రమేపి తగ్గుతుందని కొన్ని సందర్భాల్లో గరిష్టంగా 12 శాతం వరకు నష్టం కలుగుతుందని నివేదికలు తెలుపుతున్నవి. అకాల వర్షాలు, వరదలు, వడగాల్పులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలన్ని భూతాపం వల్లనే సంభవిస్తుంటాయి. 2030 నాటికి కర్బన ఉద్గారాలను 43 శాతం మేర తగ్గించకపోతే భూగోళం నిప్పుల కొలిమిలా మారుతుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణానికి అత్యంత హాని కలిగిస్తున్న మరొక అంశం నిత్యజీవితంలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడకం. మానవ జీవితం ప్లాస్టిక్ తో మమేకమై పోయింది. తేలిక పాటి చేతి సంచులు మొదలు భారీ ఉపకరణాల వరకుఅన్నింటిలోనూ ప్లాస్టిక్ వినియోగం తప్పనిసరి అయింది. ఒక అంచనా ప్రకారం ఏటా 40 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుచున్నది. ఇందులో రీసైక్లింగ్ అవుతున్నది తొమ్మిది శాతం మాత్రమే. మిగిలిన 91 శాతం డంపింగ్ యార్డులకు తరలించడం, దహనం చేయడము జరుగుచున్నది. ఈ వ్యర్ధాలు నేలను, గాలిని, నీటిని కలుషితం చేస్తున్నవి.
పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ఐరాస 2022 మార్చిలో నైరోబిలో పర్యావరణ సదస్సు నిర్వహించింది. ఈసదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ కట్టడికి ‘రెడ్యూస్, రీసైక్లింగ్, రియూజ్’ నినాదంతో ప్లాస్టిక్ వ్యర్ధాలు నిర్వహణకు చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. భూమండలంపై 99 శాతం ప్రజలు కలుషిత గాలిని పీలుస్తున్నారని వాయు కాలుష్యం వలన ఏటా లక్షలాది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని డబ్ల్యు హెచ్ఓ నివేదికలు స్పష్టం చేస్తున్నవి. రసాయన ఎరువుల వినియోగంతో నేలలు సహజత్వం కోల్పోయి నిస్సారమైపోతున్నవి. పారిశ్రామిక, పట్టణ వ్యర్థాలతో భూగర్భ, ఉపరితల జలాలు కాలుష్యం బారినపడుతున్నవి. గాలి సైతంశుద్ధి చేయలేనంతగా కాలుష్యం అయిపోయింది. అధిక కాలుష్యంతో నిండిన గాలిని పీల్చిన మానవుని జీవితకాలం సగటున 3.2 ఏండ్లు తగ్గుచున్నది. ప్రపంచంలోని కాలుష్య దేశాల్లో భారత్ రెండవదని చికాగోవర్సిటీ అధ్యయనాల్లో తేలింది. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్య నగరంగా ఢిల్లీ అని అక్కడ నివసిస్తున్న వారి సగటు ఆయుష్షు 11.9 సంవత్సరాలు తగ్గిపోతున్నదని నివేదికలు స్పష్టం చేస్తున్నవి. పర్యావరణ పరిరక్షణ అంశాన్ని ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకొని ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారిలో సామాజిక చైతన్యం తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పొగ విడుదల చేయని వాహనాలను వాడేలా విస్తృత ప్రచారం చేయాలి. నగరాల్లో వీలైసంత ఎక్కువగా ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకునేలా పౌరులను ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా చూడాలి. ప్రభుత్వాలు సైతం అడవుల విస్తీర్ణం పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలి. పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిని ఇతోదికంగా పెంచాలి. సాధ్యమైనం తవరకు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలి. ముఖ్యంగా జల వనరులను సంరక్షించుకోవాలి. పర్యావరణాన్ని కాపాడుకోవడం అనునది ప్రభుత్వ విధి మాత్రమే కాదు, ప్రజల బాధ్యత కూడా అని అందరం గుర్తుంచుకోవాలి. ప్రకృతిని ఎంతగా ప్రేమిస్తే ప్రకృతి అంతగా సంపదలను, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది. ప్రకృతి మన అవసరాలు మాత్రమే తీరుస్తుంది మన అంతులేని కోరికలను కాదని మహాత్మా గాంధీజీ చెప్పిన మాటలను ప్రతి ఒక్కరు గుర్తె రిగి పర్యావరణ పరిరక్షణకు పాటు పడితేనే భవిష్యత్ తరాలకు మనం పచ్చని, పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని అందించవచ్చు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. – (సోర్స్: పుల్లూరు వేణుగోపాల్ AH)