సెలవుపై వెళ్లిన ఏపీ సీఎస్‌ జవహార్‌ రెడ్డి.. సాయంత్రం వరకు కొత్త సీఎస్‌ నియామకానికి అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాల దృష్టిలో వివాదస్పదుడిగా పేరుతెచ్చుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్‌రెడ్డి సెలవుపై వెళ్లారు. సాధారణ పరిపాలన శాఖ ఆదేశాల మేరకు గురువారం ఆయన సెలవు పెట్టి వెళ్లారు.

ఎన్నికల సమయంలో సీఎం వైఎస్‌ జగన్‌ (Jagan) కు తొత్తుగా వ్యవహరించారని, కోడ్‌ ఉన్నప్పటికినీ వైసీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు ఇబ్బందులకు గురిచేశారని జవహార్‌రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల బాధ్యతల నుంచి తొలగించాలని ఆయనపై ఈసీ(EC) కి సైతం ఫిర్యాదు చేశారు. పోలింగ్‌, కౌంటింగ్‌ పూర్తికావడం, కూటమికి అనుకూలంగా ఫలితాలు రావడంతో ఆయనను సీఎస్‌ పదవి నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అదేవిధంగా ఈనెలాఖరులో ఆయన ఉద్యోగ విరమణ (Retirement) చేయనుండడంతో ఆయనను సీఎస్‌గా కొనసాగించవద్దని కొత్తగా ఏర్పడబోయే వారి నుంచి మౌఖిక ఆదేశాలు రావడంతో సెలవుపై వెళ్లాలని సాధారణ పరిపాలన శాఖ నుంచి ఆదేశాలు ఇప్పించినట్లు సమాచారం. దీంతో సెలవు పెట్టి వెళ్లిన సీఎస్‌ స్థానాన్ని భర్తి చేసేందుకు గురువారం సాయంత్రం నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.