కిసాన్‌ నిధి విడుదల చేస్తూ ఫైల్‌పై ప్రధాని మోదీ తొలి సంతకం

ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సెంట్రల్‌ సెక్రటేరియట్‌ సౌత్‌ బ్లాక్‌లోని పీఎంవోలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్‌ నిధి 17వ విడత నిధులు విడుదల చేస్తూ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. దీనివల్ల 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. దాదాపు రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం అందనుంది.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం మోదీ మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందుకే రైతు సంక్షేమానికి సంబంధించిన ఫైల్‌పైనే తొలి సంతకం చేసినట్లు తెలిపారు. రైతుల కోసం, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం మున్ముందు మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు ప్రధాని వెల్లడించారు.