వర్షం కురుస్తుందా.. వ్యర్థాలు వదిలెయ్..!

  • పలు రసాయన పరిశ్రమల తీరిది..
  • సమీప కాలనీల ప్రజలకు తీవ్ర ఇక్కట్లు
  • కాలుష్యంపై పీసీబీకి ఏటా వేలల్లో ఫిర్యాదులు

పలు రసాయన పరిశ్రమల నిర్వాహకుల స్వార్థం. . సమీప నివాస ప్రాంతాల్లోని ప్రజల మనుగడను దుర్భరంగా మారుస్తోంది. పీల్చడానికి మంచి గాలి, సురక్షిత తాగు నీరు.. ప్రశాంత వాతావరణం కనుమరుగవుతోంది. పలు పరిశ్రమల నిర్వాహకులు.. వ్యర్ధాల శుద్ధి ఖర్చును తగ్గించుకునేందుకు వర్షాలను ఉపయోగించుకుంటున్నారు. నిత్యం వెలువడే వ్యర్ధాల్ని డ్రమ్ముల్లో నింపుతూ, వానలు పడ్డప్పుడు ఆ నీటిలో వదిలేస్తున్నారు. సాధారణంగా వర్షాకాలంతో తలెత్తే ఈ సమస్య ఈసారి ఆకాలవర్షాల కురుస్తుండటంతో ఏప్రిల్ నుంచే మొదలైంది. ఐడీఏ ఉప్పల్, నాచారం, జీడిమెట్ల, కాటేదాన్, బొల్లారం, గడ్డపోతారం, పటాన్ చెరు, ఖాజీపల్లి వంటి ప్రాంతాల్లో కొన్ని పరిశ్రమలు రసాయన వ్యర్ధాల్ని ఇటీవల వానల సమయంలో బయటకు వదిలిపెట్టాయి. దీంతో ఈ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఏటా మూడు వేల ఫిర్యాదులు !
మొత్తంగా కాలుష్య సమస్యలపై పీసీబీకి రాష్ట్రవ్యాప్తంగా ఏటా మూడు వేల వరకు ఫిర్యాదులు వస్తున్నట్లు అంచనా. సగటున ప్రతి నెల రెండు, మూడు, వందలు వస్తున్నాయి. ఒక్క జిన్నారం మండలం నుంచే ఏడాదికి వెయ్యికి పైగా ఫిర్యాదులు ఉంటున్నాయి. బాధిత ప్రజలు టోల్ నంబర్ – 10741, పీసీబీ వెబ్ సైట్ ద్వారా, నేరుగా జోనల్, ప్రధాన కార్యాలయాలకు వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజి గిరి, సంగారెడ్డి, కొత్తగూడెం, యాదాద్రి-భువనగిరి జిల్లాల నుంచి ఎక్కువ పిర్యాదులు వస్తున్నాయి. కొత్తగా చౌటుప్పల్, తాండూరు, కొత్తూరు, నల్లగొండ, రామగుండం, వరంగల్, ఖమ్మం వంటి నగరాలు, పట్టణాల్లోనూ ఈ సమస్య పెరిగిపోతోంది. గత ఏడాది 508 పరిశ్రమలపై ఫిర్యాదులు రాగా.. పీసీబీ జరిపిన తనిఖీల్లో ఏకంగా 266 పరిశ్రమలు కాలుష్య నివారణ చట్టాల్ని ఉల్లంఘించినట్లు వెల్లడి కావడం క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అద్దంపడుతోంది. వీటిలో 87 పరిశ్రమ లను పీసీబీ మూసివేయించగా.. 179 పరిశ్రమలను లోపాలు సవరించుకోవాలని హెచ్చరించింది. జిన్నారం మండలంలో 15 పరిశ్రమల బ్యాంకు గ్యారంటీని జప్తుచే సింది. రేయింబవళ్లు భవన నిర్మాణాల కారణంగా ధ్వని కాలుష్యంతోనూ ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు.

ఫిర్యాదుల సేకరణలో నిర్లక్ష్యం..
ఒక పరిశ్రమపై వేర్వేరు వ్యక్తులు చేసిన ఫిర్యాదుల్ని, వేర్వేరు సమయాల్లో ఇచ్చిన వాటిని పీసీబీ అధికారులు ఒకే గాటన కడుతున్నారు. కాలుష్య సమస్యలపై బోల్టై నంబరు కాల్ చేసినప్పుడు.. వివరాలు నమోదు చేసుకోకుండా అధికారుల్ని పంపిస్తామని చెప్పి పెట్టేస్తున్నట్టు సమాచారం. దీనిపై ఫిర్యాదు వచ్చిన కుపెనీకి సమాచారాన్ని చేరవేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలా అనేక ఫిర్యాదులపై విచారణ క్షేత్రస్థాయి వరకు వెళ్లడం లేదు. కొందరు వ్యక్తులు, సంస్థలు పిర్యాదుల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి పేర్కొన్నారు.

నరకం అనుభవిస్తున్నాం..
గడ్డపోతారం, కాజీపల్లిలలో పరిశ్రమల కార ణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. జల, వాయు కాలుష్య సమస్యలతో నరకం అనుభవి స్తున్నాం. కాలుష్య నియంత్రణ మండలి అధికా రులకు ఫిర్యాదు చేసినా నామమాత్రపు చర్యలకే పరిమితం అవుతున్నారు..
-నవీన్, కిష్టాయపల్లి, జిన్నారం, మెదక్ జిల్లా

ఈ వ్యర్థాల శుద్ధి ఎప్పుడో?
* రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులతో పాటు మూసీ తదితర ఉపనదుల్లో.. పీసీబీ, సీపీసీ బీలు ప్రతి నెలా 280 ప్రాంతాల్లో కాలుష్య నమూనాలు సేకరిస్తాయి. వీటిలో 220 పైచిలుకు ప్రాంతాల్లో నదులు, ఉపనదులు కాలుష్య కోరల్లో ఉన్నాయి.
* రాష్ట్రంలో ప్రతిరోజు 2,750 మిలియన్ లీటర్ల మురుగు ఉత్పత్తి అవుతుంటే.. శుద్ద అవుతున్నది దాదాపు 1217 మిలియన్ లీటర్లే.
* మిగిలిన శుద్ది కాని మురుగునీరు నీటి వనరుల్ని కలుషితం చేస్తోంది. బొల్లారం, కూకట్పల్లి, కాటేదాన్, పటాన్ చెరు ప్రాంతాల్లో నీటి కాలుష్యం పెరుగుతోందంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ నాలుగున్నరేళ్ల క్రితమే హెచ్చరించింది.
* పట్టణాలు, నగరాల్లో నిత్యం 11,522 టన్నుల ఘనవ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే.. అందులో 9,565 టన్నులనే శుద్ధి చేస్తున్నారు. (సోర్స్: ఈనాడు)