హోటల్స్‌ యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి : వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఆహారం కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – కమిషనర్ ఫుడ్ సేఫ్టీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్, నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్, ఆయిల్ మర్చంట్ అసోసియేషన్, బార్ అండ్ రెస్టారెంట్స్, ఇండియన్ డైలీ మిల్క్ ప్రొడక్ట్స్ అసోసియేషన్, తెలంగాణ ప్యాకేజెడ్ డ్రింకింగ్ వాటర్ అసోసియేషన్, తెలంగాణ రోలర్ ఫ్లోర్ మిలర్స్, బేకరీ అండ్ ఐస్ క్రీమ్స్ అసోసియేషన్‌లు పాల్గొన్నాయి.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని వివిధ అసోసియేషన్ ప్రతినిధులకు సూచించారు. నిజాం కాలం నుంచి హైదరాబాద్ బిర్యాని కి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందన్నారు. హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతున్నామన్నారు. హోటల్స్‌ యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వర్క్ షాప్‌ల నిర్వహణతో పాటు అవగాహన సదస్సులను నిర్వహిస్తామన్నారు.