ఏపీ గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన చంద్రబాబు

టీడీపీ అధ్యక్షుడు, శాసనసభా నేత చంద్రబాబు నాయుడు ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం విజయవాడలో భేటీ అయిన కూటమి నాయకులు చంద్రబాబును శాసనసభ నేతగా ఎన్నుకొన్నారు. దీనికి సంబంధించిన తీర్మాన కాపీని కూటమి నాయకులు గవర్నర్‌కు అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కూటమి కోరిన మేరకు గవర్నర్‌ సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో చంద్రబాబు గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకుల కూటమి 175 అసెంబ్లీ స్థానాలకు 164 స్థానాల్లో గెలుపొందారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 11 స్థానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్‌ ఒక్కస్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది.

దీంతో కూటమి ఆధ్వర్యంలో బుధవారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కూటమి సభ్యుల్లో కొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పవన్‌కల్యాణ్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం.