- కార్మికుల ప్రాణాలు చెల్లాచెదురు
- ఐదుగురు కార్మికులు మృతి.. 13 మందికి తీవ్ర గాయాలు
- మృతులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే..
- చెల్లాచెదురుగా పడిపోయిన శరీర భాగాలు
- ఆటో క్లేవ్ కంప్రెషర్ పేలడంతో ప్రమాదం
- కంపెనీపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
వారంతా బతుకు దెరువు కోసం రాష్ట్రాలు దాటి వచ్చారు. రోజూలాగే బూర్గుల శివారులోని సౌత్ గ్లాస్ కంపెనీలో పనిలో నిమగ్నమయ్యారు. ఆటో క్లేవ్ కంప్రెషర్ డోర్ లాక్ కాకపోవడంతో గ్యాస్ ప్రెషర్ ఎక్కువై కంప్రెషర్ పేలిపోయింది. పేలుడు ధాటికి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల కాళ్లు, చేతులు, తలలు సైతం ఎగిరిపడిపోయాయి. మరో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. కంపెనీలో పనిచేసే కార్మికులకు సరైన సేఫ్టీ పరికరాలు లేకపోవడం వల్లే ప్రమాదం తీవ్రత ఎక్కువైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కంపెనీలో కనీసం ఫైర్ సేఫ్టీ సౌకర్యం లేదని, టెక్నీషియన్ లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూఖ్ నగర్ మండలం బూర్గుల గ్రామపంచాయతీ పరిధిలో సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రమాదవశాత్తు ఆటో క్లేవ్ కంప్రెషర్ పేలుడు దాటికి ఐదుగురు కార్మికులు మృతి చెందారు. 15 మందికి పైగా కార్మికులకు తీవ్ర గాయాలయ్యా యి. శుక్రవారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల సమయంలో కార్మికులు ఆటో క్లేవ్ కంప్రెషర్ గ్లాస్ ను ఒక ఆకృతిలోనికి చేర్చేందుకు గ్యాస్ ఆక్సీజన్ కలిపి పీసీబీ ప్రక్రియ చేస్తున్న క్రమంలో డోర్ లాక్ పడకపోవడంతో కంప్రెషర్ ఎక్కువ కావడంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు సంభవించిన సమయంలో అక్కడే పనిచేస్తున్న ఐదుగురు కార్మికులు తునాతునకలై ఎక్కడెక్కడో ఎగిరి పడ్డారు. వీరు బిహార్ రాష్ట్రానికి చెందిన నికిత్ కుమార్ (22), రామ్సెత్ (24), రామ్ ప్రకాష్(31), చిత్తరంజన్ (31), రతికాంత్ (25) మృతిచెందారు. ఘటన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. సంఘటన స్థలాన్ని శంషాబాద్ డీసీపీ రాజేశ్ పరిశీలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ పరిశ్రమలో 250 మంది కార్మికులు పని చేస్తుంటారు. వీరంతా ఉత్తర్పదేశ్, ఝార్ఖండ్, ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఉంటున్నారు. రెండు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. ప్రమాదం కారణంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలో మృతదేహాలను గుర్తించడానికే పోలీసులకు చాలా సమయం పట్టింది
క్షతగాత్రులు..
1) మైకేల్ ఇమ్రాన్ (25), ఝార్ఖండ్, 2) సుబోద్ (22) ఝార్ఖండ్, 3) గోవిందు (25), బిహార్, 4) మంతు (23) బిహార్ 5) సుమీత్ కుమార్ (18), బిహార్, 6) రోషన్ కుమార్ (20), బిహార్, 7) రాజేశ్ పాషా (36), బిహార్, 8) సుజాత (24), బూర్గుల, 9) నీలమ్మ (40), కాశిరెడ్డిగూడ, 10) మమత (28), కాశిరెడ్డిగూడ, 11) రాతి కాంత్ (37), ఒడిశా, 12) సురేంద్ర పాశ్వాన్ (21), బిహార్, 13) కార్తీక్ (19), ఝర్ఖండ్
నిపుణులు ఎక్కడ?.. సాంకేతిక పరమైన పనుల్లో నైపుణ్యం లేని కార్మికులను నియమించడంతో ఇలాంటి ఘటనలు జరుగుతు న్నాయి. గతంలో జీడిమెట్ల, కాటే దాన్, నాచారం, మల్లాపూర్ తదితర పరిశ్రమల్లో జరిగిన ఘటనల్లోనూ అనేక మంది బలయ్యారు. గాయప డిన వారి పరిస్థితి దుర్భరంగా మారింది. కనీసం వారి కుటుంబాల బాగోగులు, ఆర్థికంగానూ సహాయం అందించడంలో పరిశ్రమల నిర్వాహకులు నిర్లక్ష్యం వవహిస్తున్నారు.
కార్మికులకు ఇలా చేస్తే మేలు..
* విధుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు చట్టపరంగా రావాల్సిన పరిహారం ఇప్పించాలి.
* సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం కేసు నమోదు చేయాలి.
* మరణించిన కార్మికుడికి ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యం లేకపోతే కార్మికశాఖ ద్వారా బాధిత కుటుంబాలకు పరిహారం ఇప్పించాలి.
* ప్రమాదాల్లో అంగవైకల్యం పొందిన కార్మికులకు పించన్లు అందించాలి.
* ప్రమాదాల నివారణలో భాగంగా ప్రతి కంపెనీలో విధిగా వర్క్ పర్మిట్ సిస్టమ్ అమలు చేయాలి.
* ప్రతి పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించాలి. రియాక్టర్ల పనితీరు పర్యవేక్షించాలి. ప్రమాదాల నివారణపై కార్మికులకు అవగాహన కల్పించాలి.
* ఈఎస్ఐ ఆసువత్రుల్లో 24 గంటల వైద్య సేవలు అందించాలి. లేబర్ ఆఫీసు, కాలుష్య నియంత్రణ మండలి, ఇన్ స్పెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ కార్యాలయాలను జీడిమెట్లలో ఏర్పాటు చేయాలి.
కలగ మారిన కార్మికుల భద్రత
* కార్మికుల రక్షణను పట్టించుకొని పరిశ్రమ యాజమాన్యాలు
పరిశ్రమల్లో లోపించిన భద్రతా ప్రమాణాలతో విధులకు వెళ్లిన కార్మికులు క్షేమంగా ఇల్లు చేరేవరకూ అనుమానమేనన్న పరిస్థితి నెలకొంది. తాజాగా షాద్ నగర్ లో జరిగిన ప్రమాదంలో పొట్టకూటి కోసం వచ్చిన అమాయకులు బలయ్యారు. కనీస రక్షణ చర్యలు లేకపోవడం, నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించుకోకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముఖ్యంగా ప్రమాదాలకు కారణమయ్యే రియాక్టర్లు బాంబుల్లా పేలుతున్నాయి. కీలక ప్రాంతాల్లో నిపుణులైన కార్మికులు పనిచేయాల్సి ఉండగా.. తక్కువ జీతాలకు పనిచేసేందుకు వస్తున్నారని.. కనీస అవగాహనలేని తాత్కాలిక, కాంట్రాక్ట్ కార్మికుల చేత పనులు చేయిస్తున్నారు. రియాక్టర్ల ఒత్తిడిని సరైన సమయంలో గుర్తించకపోవడం, కెమికల్ రియాక్షన్ను నివారించడంలో విఫలం కావడంతో పేలుళ్లు సంభవిస్తున్నాయి. జీడిమెట్ల, నాచారం, కాటేదాన్, షాద్ నగర్ లలో మూడేళ్లలో జరిగిన ప్రమాదాల్లో 15 మంది మృతి చెందగా 50 మంది గాయాల పాలయ్యారు. స్థానికేతరులే ఎక్కువగా.. విధులు నిర్వహించే వారిలో అధికంగా స్థానికేతరులే ఉండటంతో వారి తరపున పరిశ్రమలపై పోరాటం చేసే వారు లేక తీవ్రంగా నష్టపోతున్నారు. పైగా శివార్లలోని పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగిన వెంటనే చికిత్స కోసం తరలించేందుకు అంబులెన్స్ లాంటి వాహనాలు లేక నగరానికి చేరేలోపు మరణిస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయి. పరిశ్రమల్లో రక్షణ చర్యలు సక్రమంగా లేకున్నా వాటిని పరిశీలించి. వెంటనే చర్యలు చేపట్టడంలో సంబంధిత అధికారులు లంచాలు తీసుకోవడంతోనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.