కాలుష్య రహిత నియోజకవర్గమే లక్ష్యం : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడును కాలుష్య రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో నల్లగొండ, యాదాద్రి జిల్లాలకు చెందిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పరిశ్రమల శాఖ, లేబర్ డిపార్ట్ మెంట్ అధికారులతో సమీక్షనిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో కాలుష్యం వెదజల్లే రెడ్ కేటగిరీ కంపెనీలపై చర్యలు తీసుకుంటున్నారా? తీసుకుంటే ఇప్పటి వరకు ఎన్ని కంపెనీలకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకున్నారు అని ప్రశ్నించారు. పరిశ్రమల నుండి వచ్చేసి.ఎస్.ఆర్ నిధులు ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నారని, నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమల్లో స్థానికులకు ఎంతమందికి ఉపాధి కల్పించారని అడిగి తెలుసుకున్నారు. మునుగోడు మండలంలోని కిష్టాపురం, గట్టుప్పల్ లో ఏర్పాటు చేస్తున్న ఫార్మా కంపెనీలను అనుమతించేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పారు. అందరం ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం, మునుగోడు నియోజకవర్గాన్ని కాలుష్య బారిన పడకుండా చేయాలని అధికారులకు సూచించారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపై డీటెయిల్ గా మళ్లీ వారం రోజుల తర్వాత సమీక్ష నిర్వహించుకుందామని తెలిపారు.