- పరిశ్రమల నుండి తన్నుకొస్తున్న పొగల రక్కసి
- బాలానగర్ మండలంలో మృత్యుకుహారాల్లా పరిశ్రమలు
- బాలానగర్, రాజాపూర్ పరిధిలో 60కి పైగా కర్మాగారాలు
- ప్రమాదపుటంచున పదికి పైగా ఫ్యాక్టరీలు
- గతంలో రాజాపూర్ రసాయన పరిశ్రమలో బారి పేలుడు పలువురికి గాయాలు
- కాలం చెల్లిన యంత్రాలు, బాయిలర్లు, కంప్రెషర్లు
- పర్యవేక్షణలో అధికారుల అలసత్వం
పాలమూరు జిల్లా బాలానగర్, రాజాపూర్ మండలాలు కాలుష్యంతో తల్లడిల్లుతున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన 14,000 మంది పైగా కార్మికులు కూలీలు ఈ మండలాల్లో ఉన్న 60 పైగా పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. ఆ పరిశ్రమల నుండి బయటికొస్తున్న పొగరక్కసితో అక్కడి కార్మికులతో పాటూ ఆయా ప్రాంతాల నివాసులు భయాందోళన చెందుతున్నారు. మరోవైపు నిబంధలకు నీళ్లొదిలి పరిశ్రమలు నడుపుతున్నా… కాలం చెల్లిన యంత్రాలను వాడుతున్నా.. ప్రమాదాలు జరుగుతున్నా.. ప్రాణాలు గాల్లో కలుస్తున్నా పట్టించుకోని అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బతుకు జీవుడా అంటూ బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా శ్రామిక చట్టాలకు లోబడకుండా ప్రమాదపు పరిశ్రమల కుహరాల్లో కూలీలుగా కుదిరిన సగటు దినసరి కూలి అక్కడ జరిగే ఆకస్మిక ప్రమాదాల బారినపడి మృత్యువాత పడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్, బాలానగర్ మండలాల పరిధిలోని ఓ రసాయనిక ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో పలువురు తీవ్ర గాయాలపాలై ఇప్పటికి దివ్యాంగులుగా తమ బతుకును కొనసాగిస్తున్నారు. నాటి రసాయన పేలుడు పదార్థం ప్రధాన రహదారి పరిసర ప్రాంతం వరకు పాకడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందారు. అలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు ఆగ మేఘాలమీద అక్కడికి చేరుకొని హాల్చల్ చేస్తారు తప్పిస్తే కొన్ని రోజులు కాగానే అంతా యథాతథం.. రెండు మండలాల పరిధిలోని పరిశ్రమల్లో రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 14,000 మంది పైగా కార్మికులు కూలీలుగా పనిచేస్తున్నారు. ఇటీవల బూర్గుల దగ్గర జరిగిన ఘటనతో వారంతా తమ పనిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రాజాపూర్ మండల పరిధిలోని రంగారెడ్డి గూడ శివారులో గల రసాయన పరిశ్రమలో కొన్ని సంవత్సరాల క్రితం యాసిడ్ రియాక్టర్ పగిలి జాతీయ రహదారి పైకి వచ్చి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు పరిశ్రమ కొన్ని రోజులు మూసివేయబడిందని, తరువాత కొన్ని రోజులకు తిరిగి మళ్లీ ప్రారంభం అయ్యింది. మొదట అనుఫార్మా అని పేరు ఏ పేరు లేకుండా రసాయనాలు తయారు చేస్తున్నారని, ఈ పరిశ్రమలో పెద్ద, పెద్ద గాజు కుండలలో కెమికల్ తయారు చేసేటప్పుడు చాలా సందర్భాల్లో గాజు కుండలు పగిలి కార్మికులు గాయపడే వారని, అలా ఒకసారి గాజా ఫ్లాస్క్ లో ప్రయోగం చేస్తుండగా ఫ్లాస్క్ పగిలి రంగారెడ్డి గూడ గ్రామానికి చెందిన కార్మికునికి ఒళ్లంతా కాలిపోయి, సంవత్సరకాలం పాటు చికిత్స తీసుకున్నాడని గ్రామస్తులు తెలిపారు. ఇలాంటి పరిశ్రమలో ఎటువంటి సేఫ్టీ పరికరాలు ఉన్నాయో అని గ్రామస్తులు భయపడుతున్నామంటున్నారు. ఎందుకంటే చాలా పెద్ద రియాక్టర్లలలో కెమికల్ తయారు చేస్తున్నారని సమాచారం. అక్కడ అన్ స్కిల్ కార్మికులను పెట్టి పనిచేయిస్తుంటారని గ్రామస్తులు అంటున్నారు. సౌత్ గ్లాస్ ప్రమాదం చూసిన గ్రామస్తులు గ్రామ శివారులో ఉన్న కెమికల్ పరిశ్రమలో, మరో పరిశ్రమ బిలాస్ రాయి స్పాంజ్ ఐరన్ పరిశ్రమలో ఉన్న బాయిలర్లను రియాక్టర్ లను పరిశ్రమల శాఖ అధికారులు పరిశీలించి కాలం చెల్లిన రియాక్టర్లు, బాయిలర్లు ఉంటే వెంటనే, మార్పు చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బాలా నగర్ మండల పరిధిలో 37 పరిశ్రమలు ఐరన్ కంపెనీలలో నవదుర్గ ఐరన్ కంపెనీ స్టీల్ తయారవుతుంది. దివ్యసాయి ప్రైవేట్ లిమిటెడ్ డోర్స్ తయారవుతాయి, ఆయిల్ మిల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆయిల్ తయారు అయితది. ఉండేడ ఐరన్ కంపెనీ స్టీల్ తయారవుతది, కంకర డస్ట్ తదితర పరిశ్రమలు ఉన్నాయి.
కాలం చెల్లిన సామగ్రితో పనులు
ఈ మండలంలోని పరిశ్రమలలోనూ కాలం చెల్లిన రియాక్టర్లు, కంప్రెషర్లు వాడుతూ పరిశ్రమల నిర్వాహకులు ప్రమాదమని తెలిసినా కార్మికులతో పని చేయిస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న రెండు మండలాల పరిధిలో జిల్లా కేంద్రానికి రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్నా కూడా ప్రమాదపు పరిశ్రమల గుర్తించడంలో అధికారుల ఆలసత్వంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇటీవల బూర్గుల ఘటనతో కాలం చెల్లిన పరిశ్రమలను నడిపిస్తున్న వారికి వణుకు మొదలైంది.
కార్మిక హక్కులకు దిక్కులేదు.. చట్టాల అమలు లేదు..
కార్మిక హక్కు చట్టాలనే బేఖాతరు చేస్తూ అంతరాష్ట్ర కార్మిక చట్టాన్ని కూడా అమలు చేయడం లేదు యాజమాన్యాలు ఆయా ఆ పరిశ్రమల్లో ఫైర్ ఎగ్జిట్ లు అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ప్రమాద సమయాల్లో ప్రాథమిక చికిత్స అవసరమైన కనీస ఏర్పాట్లు కూడా లేకపోవడం గమనార్హం. 40 శాతం పైగా పరిశ్రమల్లో అనధికారిక అనుమతులు లేని వస్తువులు పదార్థాల తయారీ జరుగుతుందని విశ్వసనీయ సమాచారం. పరిశ్రమల ద్వారా వెలువడే వ్యర్థాలను జనసంచారాల్లోకి రవాణా చేస్తున్నారన్న అభియోగం కూడా ఉంది. మొత్తంగా రాజాపూర్, బాలానగర్ మండలాల పరిధిలోని పరిశ్రమలు కార్మికులకు మృత్యు కుహారాలుగా మారి.. వారి కుటుంబాలు రోడ్డున పడకముందే స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నత అధికారులు స్పందించి పర్యవేక్షణ చేసి అనారోగ్య హానికరిక పరిశ్రమల నిర్వహణ పై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.(సోర్స్:ఆంధ్రప్రభ)