పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలంతా బాధ్యతగా మొక్కలు నాటాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో భాగంగా సోమవారం ఎల్బీనగర్ జోన్ పరిధిలోని రామంతపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి పొన్నం మొక్కలు నాటి గ్రేటర్ హైదరాబాద్‌లో వన మహోత్సవాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందన్నారు. కాలుష్యం పెరిగితే భవిష్యత్ తరం మనల్ని క్షమించదన్నారు. రాబోయే తరాలకు అందమైన పుడమిని అందించాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మాస్క్‌లు పెట్టుకోకుండా బతకాలం టే మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నగర వ్యాప్తంగా 30 లక్షల మొక్కలు నాటేందుకు రంగం సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
మొక్కలు నాటడం ప్రభుత్వ బాధ్యత కాకుండా ప్రజలు కూడా బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ సంవత్సరం జీహెచ్ఎంసీ పరిధిలో 30 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. అందుకోసం ప్రతి ఇంటికీ మొక్కలు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిల్లలో నేడు 7,134 పైగా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆమె వివరాలను వెల్లడించారు.