పరిశ్రమల్లో ప్రమాదాలు కార్మికుల జీవితాలకు మరణ శాసనం

  • ముక్కలవుతున్న వలస జీవుల రెక్కల కష్టం
  • ఎంత మంది కార్మికుల ప్రాణాలు పోతున్న తీరు మార్చుకోని పరిశ్రమల యజమాన్యాలు, అధికారులు

రెక్కల కష్టాన్ని నమ్ముకొని పరాయి రాష్ట్రాల నుంచి వచ్చి ప్రాణాలకు ‘తెగిం’చి పని చేస్తున్న వలస కార్మికులు ఎవరు ఊహించని విధంగా ఒక్కసారిగా ముక్కలు.. ముక్కలు అయ్యారు. శరీర భాగాలన్నీ చితికిపోయి ఏరుకునే దారుణ పరిస్థితిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ మారణకాండకు పరోక్షంగా కారణమైన యాజమాన్యం ఆ సమయంలో కంటికి కనిపించకుండా పోయింది. ఇంత దారుణం జరిగినా ఇప్పటి వరకు కుటుంబ సభ్యులకు పూర్తి సమాచారం అందిందో లేదో కూడా తెలియదు. ఇక్కడే పని చేసే మృతుల బందువులున్నా అదే పరిస్థితి, జేబులో డబ్బులు లేక.. కడుపులో ఆకలిని చంపుకోలేక.. కనిపించని యాజమాన్యం కోసం ఎదురుచూస్తూ దీనంగా కాలం వెళ్లదీస్తున్నారు మిగతా కార్మికులు, షాద్ నగర్ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులో ఉన్న సౌత్ గ్లాస్ పరిశ్రమలో శుక్రవారం జరిగిన పేలుడు పెను విషాదాన్ని మిగిల్చిన సంగతి అందరికీ తెలిసిందే.

వాహనాలకు సంబంధించిన గ్లాస్ లను సౌత్ గ్లాస్ పరిశ్రమలో తయారు చేస్తున్నారు. పరిశ్రమలోని ఆటో క్లేవ్ యూనిట్ లో గ్లాస్ తయారైన తర్వాత సాధారణంగా కంప్రెషర్ పైన ఉండే కీహోల్ దానంతట అదే తెరుచుకుంటుంది. కానీ ఇక్కడ కీహోల్ తెరుచుకోకపోవడంతో ఆటోక్లేవ్ యూనిట్ లో గ్యాస్, వేడి తీవ్రత పెరిగి ఒత్తిడి ఎక్కువై పేలుడు సంభవించింది. పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులకు ఎలాంటి రక్షణ కవచాలను పరిశ్రమ యాజమాన్యం అందించలేదని తెలుస్తోంది. ఈ పేలుడు ఘటనలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో 13 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి అనేక పరిశ్రమలలో కార్మికులకు ఎలాంటి రక్షణ కవచాలు లేకుండా పనిచేస్తున్న సంబంధిత శాఖ అధికారులు ఆ పరిశ్రమలను తరువుగా తనిఖీలు చేయరు. పరిశ్రమ యాజమాన్యాలు చేస్తున్న తప్పులు కండ్ల ముందు మనకు కనిపిస్తున్న సంబంధిత శాఖ అధికారులకు మాత్రం అవి కనిపించవని స్థానికులు, పర్యావరణ వేత్తలు, మేధావులు చెబుతున్నా మాట. ఎందుకంటే పరిశ్రమ యాజమాన్యాలు అధికారులకు అందించాల్సిన లంచాలు సకాలంలో అందిస్తారు కాబట్టే తప్పు చేస్తున్న పరిశ్రమలపై ఎటువంటి చర్యలు ఉండవని పలువురు చెబుతున్నారు. వీళ్ళకు అందాల్సిన ముడుపులు అందితే చాలు పరిశ్రమలలో ఏం జరిగిన చూసి చూడనట్టు ఉంటారని అక్కడి కార్మికులే చెబుతుండటం విశేషం. లాభాల ఆశే తప్ప పరిశ్రమ యాజమాన్యాలు కార్మికుల కోసం ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టారని చెబుతున్నారు.

వివిధ పరిశ్రమల్లో కార్మికుల కంటి ముందు ప్రమాదం జరిగి తమ వారు మృతి చెందినా ఆ పరిశ్రమ యాజమాన్యాలు కనీసం చివరి చూపు కూడా చూడనివ్వడం లేదని చనిపోయిన కార్మికుల మృతుల కుటుంబ సభ్యులు వాపోయారు. పరిశ్రమల్లో ప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేసి పరిశ్రమ ఆవరణ నుంచి బయటికి వచ్చి పొరుగు రాష్ట్రంలో ఉన్న తమ వారికి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నా సెల్ ఫోన్లలో చార్జింగ్ లేని పరిస్థితి నెలకొందని మృతుల బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం వెంటనే అందించే పరిస్తితి కూడా లేదని తెలిసింది.

పరిశ్రమల ప్రమాద సమయంలో కంటికి కనిపించని యాజమాన్యాలు
ఒక్క సౌత్ గ్లాస్ పరిశ్రమలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పరిశ్రమలో ప్రమాదం జరిగిన ఆ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా యాజమాన్యాలు జాగ్రత్త పడ్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి పరిస్థితిని బట్టి విషయం బయటకు తెలిస్తుంది. లేదంటే కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు బయటకు రాకుండానే అధికారులను మేనేజ్ చేసి ఏమి జరగనట్టే ఉంటారు అని స్థానికులు, కార్మికులు చెబుతున్నారు. కార్మికులు చనిపోతున్న వారికి పట్టింపు లేదు. చనిపోయిన వారిని అక్కడి నుండి గుట్టుగా తరలించి.. గాయపడిన కార్మికులను మూడో కంటికి తెలువకుండా ఆస్పత్రులలో చేర్పించి.. ఒక్కోసారి ఏ ఆస్పత్రిలో చేర్పించింది కూడా చెప్పకుండానే పరిశ్రమల యాజమాన్యాలు కంటికి కనిపించ కుండా పోతారని చెబుతున్నారు.

పరిశ్రమల కార్మికుల ఆకలి కేకలు
పరిశ్రమల్లో ప్రమాదం జరిగినప్పటి నుంచి అందులో ఉన్న మిగిలిన కార్మికులకు కనీసం తాగేందుకు నీరు, తినేందుకు భోజనం కరువైతుంది. పరిశ్రమల్లో ఘటన జరిగిన తర్వాత సంబంధిత శాఖల అధికారులు, నాయకులు వచ్చి పరిశీలించి వెళ్తారు. తర్వాత కార్మికులను బయటకు వెళ్లనీయకుండా పరిశ్రమల వారు గేట్లు మూసివేస్తారు. ఓ వైపు తమ వారు, స్నేహితులు ఏమయ్యారోనని భయంతో, దిగులతో రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి.

పరిశ్రమల్లో ప్రమాదాలు నిత్యకృత్యం
పారిశ్రామిక ప్రాంతలైన అయిన పటాన్ చెరు, జీడిమెట్ల, పాశ మైలారం, మఠంపల్లి, గడ్డ పోతారం, సంగారెడ్డి, కాజీపల్లి, షాద్ నగర్, జడ్చర్ల, చౌటుప్పల్, దొతిగూడెం, బొమ్మలరామారం పరిశ్రమల్లో ప్రమాదాలు నిత్యకృత్యం అయ్యాయి. తరచూ ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 2012లో షాద్ నగర్ శివారులోని స్టీమ్ కోర్ పరిశ్రమలో బాయిలర్ పేలి 12 మంది కార్మి కులు మృతి చెందారు. 2015లో కొత్తూరు వినాయక స్టీల్ పరిశ్రమలో ఫర్నస్ పేలి 10 మంది మృ త్యువాత పడ్డారు. తీగాపూర్ శివారులోని పాత టైర్లను కాల్చే పరిశ్రమలో ప్రమాదం బాయిలర్ పేలి నలుగురు, నందిగామ పరిధిలోని శివశక్తి, జాగృతి, షాద్ నగర్ పరిధిలోని ఎలికట్ట, మొగిలిగిద్ద శివారులో ఉన్న స్పాంజ్ ఐరన్ పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో 10 మందికి పైగా కార్మికులు మృత్యువాత పడటంతో పాటుగా ఎంతో మంది గాయాల పాలయ్యారు. గత సంవత్సరం జూలైలో కాశిరెడ్డిగూడ గ్రామ శివారులో ఉన్న బ్లైండ్ కలర్ పరిశ్రమలో నలుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. అక్కడక్కడ చిన్న చిన్న పరిశ్రమల్లోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అనేక పరిశ్రమల్లో తరుచూ ప్రమాదాలు జరుతూనే ఉన్నాయి. అయిన సరే పట్టించుకోవాల్సిన శాఖల అధికారులు మాత్రం అవినీతి మత్తులో జోగుతున్నారు. ప్రమాదాలు జరుగుతున్నా పరిశ్రమలపై తు తు మంత్రపు చర్యలు తీసుకొని వదిలేస్తున్నారు. ఎంత పెద్ద ప్రమాదం జరిగిన ఎంత మంది చనిపోయిన సరే ఈ అవినీతి అధికారులకు కనపడదు అని పలువురు చెబుతున్నారు. సంఘటన జరిగినప్పుడే హడావిడి చేసి తరువాత కాలం గడిచే కొద్ది పట్టించికోకుండా ఆ పరిశ్రమలకు అనుకూలంగా మారుతున్నారని వాపోతున్నారు. తప్పు చేసిన పరిశ్రమలపైనే కాదు.. తప్పు చేస్తున్న సంబందిత శాఖల అధికారులపైన కఠిన చర్యలు తీసుకుంటేనే మార్పు ఉంటాదని లేదంటే ఇలా ఎంత మంది చనిపోయిన పరిశ్రమల యజమాన్యలలో మార్పు రాదు అని కార్మికుల జీవితాలకు భరోసా ఉండదని చెబుతున్నారు.