ములుగు జిల్లా డీఎంహెచ్‌వో అప్పయ్యను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. అప్పయ్య కొండలు ఎక్కి, వాగులు, వంకలు దాటి ఆదివాసీలకు వైద్య సేవలు అందించిన విధానాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి అప్పయ్య సేవలను కొనియాడారు. వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా వాజేడు మండలంలోని అటవీ ప్రాంతంలోని పెనుగోలు గుట్టపై గిరిజనులు నివసిస్తున్నారు. వాజేడు మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ ప్రాంతానికి వెళ్లాలంటే కాలినడకే శరణ్యం. పైగా మూడు గుట్టలెక్కి.. మూడు వాగులు దాటాల్సిందే.
అయితే ఇక్కడి ప్రజలకు వైద్యసేవలందించేందుకు ములుగు డీఎంహెచ్‌వో అప్పయ్య తన సిబ్బందితో కలిసి మంగళవారం పెనుగోలు గుట్టపైకి చేరుకున్నాడు. అక్కడున్న 10 కుటుంబాలకు చెందిన 39 మందికి దోమ తెరలను అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన వైద్య సేవలందించారు. అక్కడి నుంచి బుధవారం మళ్లీ గుట్టలు, వాగులు దాటి కాలినడకన వాజేడుకు సాయంత్రం చేరుకున్నారు. ఓ జిల్లా స్థాయి అధికారి వైద్య సేవలందించేందుకు పెనుగోలు గ్రామానికి 32 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. అప్పయ్యను అధికారులతో పాటు స్థానికులు అభినందించారు.