బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలం 25న మేడిగడ్డ పర్యటనకు వెళ్తాం : హరీశ్‌రావు

ఈ నెల 25న అసెంబ్లీలో బడ్జెట్ అనంతరం.. అదేరోజు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా మేడిగడ్డ పర్యటనకు బయలుదేరుతుందని.. 26న కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించనున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రకటించారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కోవా లక్ష్మి, విజయుడు, ఎమ్మెల్సీ సురభి వాణిదేవితో కలిసి తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీజేపీకి చెరో ఎనిమిది సీట్లలో గెలిపిస్తే.. బడ్జెట్‌లో తెలంగాణకు గాడిదగుడ్డు ఇచ్చారన్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌ ఎంపీలు నిరసన తెలపాలి..
రేపు పార్లమెంట్‌లో కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన 3గంటల పాటు జరిగిందన్నారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా మధుసూధనచారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఎల్పీ మిగతా కార్యవర్గాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ నెల 25న అసెంబ్లీలో బడ్జెట్‌ అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ బృందం మేడిగడ్డకు బయలుదేరుతుందన్నారు. 26న మేడిగడ్డ, కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించనున్నట్లు తెలిపారు. లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలో వృథాగా పోతున్నా ప్రభుత్వం పంపుల ద్వారా ఎత్తిపోయడం లేదని విమర్శించారు. మిడ్‌ మానేరు, కొండ పోచమ్మ సాగర్, రంగ నాయక సాగర్‌లో నీరు నింపి రైతుల పొలాలకు తరలించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతామన్నారు.

ప్రజా సమస్యలను లేవనెత్తేందుకు ఎల్పీ సమావేశంలో కార్యాచరణ ఖరారు చేశామన్నారు. నిరుద్యోగుల సమస్యలపై రేపు చర్చ కోసం రేపు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడునెలల్లో పాల్పడ్డ కుంభకోణాలపై అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. పౌరసరఫరాలశాఖలో కుంభకోణాలు జరిగాయని.. వాటిని లేవనెత్తనున్నట్లు తెలిపారు. వేరే రాష్ట్రాల్లో నిషేధించిన బీర్లను ఇక్కడ ప్రవేశ పెట్టేందుకు చేసిన ప్రయత్నాల వెనుక ఉన్న అదృశ్య శక్తుల బండారాన్ని బయట పెట్టాలని అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. మంత్రికి తెలియకుండానే నిషేధిత బీర్ల ప్రవేశం కోసం ప్రయత్నం ఎలా జరిగింది అనే దానిపై చర్చకు పట్టుబడుతామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపుపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మిగిలి పోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు తమ ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు.

ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అన్న ఆయన.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియలో జాప్యంపై నిలదీస్తామని చెప్పారు. రైతు భరోసాలో ఆలస్యంపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనున్నట్లు తెలిపారు. ఫిరాయింపులపై అసెంబ్లీలో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తామన్నారు. కేసీఆర్ అన్ని అంశాలపై తమకు దిశానిర్దేశం చేశారన్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసమే మంత్రులతో భేటీలు అన్న రేవంత్ ఇప్పుడు చెబుతారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడారా? అంటూ నిలదీశారు. రాహుల్ గాంధీతో తెలంగాణకు జరిగిన అన్యాయంపై రేవంత్ మాట్లాడించాలని.. ప్రధాని కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేయాలన్నారు. పార్లమెంట్‌ పోడియం దగ్గరకు వెళ్లి కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు నిరసన తెలిపాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన బీఆర్‌ఎల్పీ సమావేశానికి ముందస్తు అనుమతితోనే కొందరు ఎమ్మెల్యేలు భేటీకి హాజరుకాలేదని తెలిపారు.