కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయినా రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెచ్చి కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.. సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు ఏం తెచ్చారని ప్రశ్నించారు. కేంద్ర పర్యాటక మంత్రిగా నగరానికి చేసిందేమీ లేదని విమర్శించారు.
హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నారా అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌ను సిద్ధం చేయడానికి ముందే రాష్ట్ర అవసరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. అయినా ఎలాంటి సహకారం లేదని విమర్శించారు. గంగా ప్రక్షాళనకు బడ్జెట్ కేటాయించిన కేంద్రం.. మూసీ అభివృద్ధికి మాత్రం ఎందుకు ఇవ్వదని నిలదీశారు. కారణం లేకుండానే కేసీఆర్ నీతి అయోగ్ సమావేశానికి వెళ్లలేదని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, దానికి నిరసనగానే తాము ఆ సమావేశాన్ని బాయ్‌కాట్ చేస్తున్నామన్నారు. తమ్మిడిహెట్టి దగ్గర బ్యారేట్ కట్టకపోవడం వల్ల భారీ నష్టం జరిగిందని తెలిపారు. మేడిగడ్డ వద్ద నీరు పంప్ చేయడానికి అవకాశం లేదని ఎన్డీఎస్‌ఏ చెప్పిందన్నారు. బడ్జెట్ లో హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించిన సీఎం, డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. జీహెఎంసీ, వాటర్ బోర్డు, మెట్రోలకు ప్రభుత్వం ఆర్థిక ఊతం ఇచ్చిందని చెప్పారు.