కాలుష్యం వెదజల్లుతుంటే ఏం చేస్తున్నారు..?

  • గ్రానైట్ పరిశ్రమలపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

కరీంనగర్ జిల్లా బావో పేట్ కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్ లో గ్రానైట్ క్వారీలతో పరిసరాల్లో పెరిగిపోతున్న కాలుష్య నివారణకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాలుష్య నిబంధనలు అమలు చేయని క్వారీలపై ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. గ్రానైట్, పాలిషింగ్, కటింగ్ యూనిట్ల ఏర్పాటుతో పరిసర ప్రాంతాలు కాలుష్యం బారిన పడుతున్నాయంటూ డాక్టర్ డి. అరుణ్ కుమార్ రాసిన లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాదే, జస్టిస్ జె. శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అక్కడ ఉన్న గుట్టల్లోని పచ్చదనంతో పశువులు, గొర్రెల పెంపకం ద్వారా పలువురు జీవనోపాధి పొందుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం మైనింగ్ పరిశ్రమల వల్ల పచ్చదనం పోయి.. కాలుష్యం పెరిగిపోయిందన్నారు. 10 గ్రామాల్లోని 35 నుంచి 40 వేల మంది ప్రజలపై కాలుష్య ప్రభావం పడుతోందన్నారు. గ్రానైట్ పాలిషింగ్ వ్యర్ధాలను జల వనరుల్లోకి వదులుతుండటతో కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులోని అంశాలను పరిశీలించిన ధర్మాసనం ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి, పరిశ్రమల శాఖ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శులు, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, కరీంనగర్ జిల్లా కలెక్టర్, గనుల శాఖ సహాయ డైరెక్టర్, పర్యావరణ ఇంజనీరు, కొత్తపల్లి తహసీల్దార్లకు నోటీసులు జారీ చేసింది.

ఇసుక అక్రమ మైనింగ్ పై హైకోర్టు నోటీసులు
కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండలంలో ఇసుక అక్రమ మైనింగ్ పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీన్ని అరికట్టడానికి తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ప్రైవేటు వ్యక్తులతో అధికారులు కుమ్మక్కు కావడంతో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ సాగుతోందని కామారెడ్డి జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ. ప్రకాష్ రాసిన లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాదే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పోలీసు, ఆర్టీవో, రెవెన్యూ, ఖనిజాభివృద్ధి కార్పొరేషన్, మైనింగ్ అధికారులు ఆక్రమార్కులతో కుమ్మక్కయ్యారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రోజుకు రూ.20 లక్షల నుంచి 30 లక్షల నష్టం వాటిల్లుతోందని లేఖలో పేర్కొన్నారు. ఖడ్గం-శెట్లూరు శివారులోని ఆరు క్వారీల్లో ఇసుక తవ్వకాలకు గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతి కాలపరిమితి ముగిసినా తవ్వకాలను కొనసాగిస్తూనే ఉన్నారన్నారు. ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు ర్పాటు చేసి పర్యవేక్షించేలా ఆదేశించాలని కోరారు. ఇందులోని అంశాలను పరిశీలించిన ధర్మాసనం ప్రతివాదులైన భూగర్భ, గనుల శాఖ, రెవెన్యూ, హోం, రవాణా శాఖల ముఖ్య కార్యదర్శులు, గనుల శాఖ ఎండీ, సహాయ డైరెక్టర్, కామారెడ్డి కలెక్టర్, ఎస్పీ, బిచ్చుకుంద తహసీల్దార్లకు నోటీసులు జారీచేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.