సుప్రీంకోర్టుతో పాటు ఈ కోర్టు పలు ఆదేశాలు జారీ చేస్తున్నా అటవీ నేరాలు తగ్గడం లేదని, ఫలితంగా ఆటవీ ప్రాంతం తగ్గిపోతోందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పోడు వ్యవసాయం పేరుతో కొంతమంది, ఆక్రమణలతో మరికొంతమంది, పెద్ద ప్రాజెక్టుల పేరుతో కంపెనీలవారు ఆటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తున్నారంది. ఇకపై
చెట్ల నరికివేత, పోడు సాగుకు పాల్పడేవారితో ధ్వంసమైన అటవీ ప్రాంతంలో మొక్కలు నాటించాలని ఆదేశించింది. అటవీ శాఖాధికారులు సీజ్ చేసిన ట్రాక్టర్ ను విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ మంచిర్యాల జిల్లా జిల్లెడకు చెందిన ఎం.మల్లేశ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.శ్రవణ్ కుమార్ ఇటీవల విచారణ చేపట్టారు. కుష్నేపల్లి రేంజ్ లోని లింగాల సెక్షన్లో ట్రాక్టర్ ద్వారా రెండెకరాల మేర అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేశారంటూ మల్లేక్పై అటవీ సెక్షన్ అధికారి జులై 1న కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ను సీజ్ చేశారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి గతంలో ఇలాంటి కేసులో వాహనం విడుదలకు హైకోర్టు కొన్ని షరతులు విధించిందని, వాటి ప్రకారం రూ.50 వేలు డిపాజిట్ చేయాలని, ఇతరులకు ట్రాక్టర్ ఇవ్వకూడదని, అధికారులు అడిగినపుడు తీసుకురావాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. ద్వంసమైన అటవీ ప్రాంతం లోని రెండెకరాల్లో ఎకరానికి 100 చొప్పున మొక్కలు నాటాలని పిటిషనరు ఆదేశాలు జారీ చేశారు. పిటిషనర్కు మొక్కలు అందించాలని సూర్యాపేట జిల్లా అటవీశాఖాధికారిని ఆదేశించారు. ఈ ఉత్తర్వుల అమలుపై నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబరు 6కు వాయిదా వేశారు.