ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం : ఆదిలాబాద్‌ జిల్లా ప్రత్యేక అధికారి, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ మెంబర్‌ సెక్రటరీ జీ. రవి

ప్లాస్టిక్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దామని స్వచ్ఛదనం-పచ్చదనం ఆదిలాబాద్‌ జిల్లా ప్రత్యేక అధికారి, మెంబర్‌ సెక్రటరీ టీజీ, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ జీ. రవి అన్నారు. స్వచ్ఛదనం -పచ్చదనం కార్యక్రమంపై సమీక్షా సమావేశాన్ని శుక్రవారం ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌లో నిర్వహించారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం అమలు తీరుపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పరిసరాల శుభ్రత, సీజనల్‌ వ్యాధుల నివారణపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించాలని, అంతర్గత రోడ్ల అభివృద్ధి, ప్రతి ఇంటి వద్ద స్వచ్ఛతతో పాటు పచ్చదనం కూడా ఉండే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్‌ పరిధిలో ఆశ కార్యకర్తలు వైద్య సిబ్బంది నిత్యం గమనిస్తూ ఉండాలన్నారు. ఆరోగ్య సర్వే నివేదిక సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం కలెక్టర్‌ రాజర్షి షా మాట్లాడుతూ స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని ప్రణాళికతో విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలోని అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మొకలు నాటారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్యామలా దేవి, ట్రెయినీ కలెక్టర్‌ అభిజ్ఞాన్‌ మాలవియ, డీఎఫ్‌వో ప్రశాంత్‌ బాజీరావ్‌ పాటిల్‌, అధికారులు, సీఈవో, డీఆర్డీవో సాయన్న, డీఎంహెచ్‌వో నరేందర్‌, ఇరిగేషన్‌, డీపీవో శ్రీలత పాల్గొన్నారు.