మట్టి గణపతి విగ్రహాల పోస్టర్ ను ఆవిష్కరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి

మట్టిని దేవునిగా చేద్దాం.. భక్తిని పూజగా అర్పిద్దాం.. అంటూ ప్రజల్లో మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన కల్పిస్తూ టీజీపీసీబీ రూపొందించిన మట్టి గణపతి విగ్రహాల పోస్టర్ ను బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆవిష్కరించారు. గణేశుడి పూజలో వినియోగించే పూలు, మూలికలను కంపోస్ట్ చేయాలని, మట్టిలో కలవని పదార్థాలను స్వచ్ఛమైన నీటి వనరులలో ముంచవద్దని ఆమె ప్రజలకు సూచించారు. ఈ సంవత్సరం గ్రేటర్ పరిధిలో 8 ఇంచుల ఎత్తుతో ఉన్న 1.20 లక్షల మట్టి గణపతి విగ్రహాలు, 32 జిల్లాల్లో 1.20 లక్షల విగ్రహాలు కలిపి మొత్తం 2.40 లక్షల విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని టీజీపీసీబీ పర్యావరణ చైతన్య కార్యక్రమాలను రూపొందించిందని, వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యా వరణ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, టీజీపీసీబీ సభ్య కార్యదర్శి జి.రవి, చీఫ్ ఇంజినీర్ బి.రఘు పాల్గొన్నారు.