పనితీరు మారకపోతే పీసీబీ రద్దుకు సిఫారసు చేస్తాం

  • 20 ఏళ్ల కేసులో మళ్లీ వాయిదాలా..?
  • కాలుష్య నియంత్రణ మండలిపై హైకోర్టు అసంతృప్తి

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) పనితీరు పై శుక్రవారం హైకోర్టు మండిపడింది. పనిచేయకుండా నిస్తేజంగా మారిందని వ్యాఖ్యానించింది. కాలుష్య కారక కంపెనీలకు మొక్కుబడిగా మూసివేత నోటీసులు జారీ చేస్తుందని, అవి హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుని తిరిగి కొనసాగిస్తున్నాయని పేర్కొంది. ఇలా అయితే పీసీబీని రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కోడిచర్ల, తీగాపూర్, గుండ్లపట్లపల్లి, రంగారెడ్డి గూడ, అప్పాజీపల్లి తండాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో స్పాంజ్ ఐరన్ పరిశ్రమలు నిర్వహిస్తుండటాన్ని సవాలు చేస్తూ 2005లో టి.రవీందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పరిశ్రమల కాలుష్యంతో పంటలు దెబ్బతింటున్నాయని, వ్యవసాయం చేయలేకపోతున్నట్లు తెలిపారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే, జస్టిస్ జె. శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కంపెనీల నిర్వహణ గురించి తెలుసుకోవడానికి మరికొంత గడువు కావాలని పీసీబీ తరపు న్యాయవాది కోరడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. 20 ఏళ్ల నాటి కేసులో మళ్లీ గడువు కోరడం ఏమిటని నిలదీసింది. కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని, కంపెనీలకే సహకరిస్తున్నట్లుందని పేర్కొంది. పీసీబీ పనితీరు ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ దశలో అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ జోక్యం చేసుకుంటూ.. పరిశ్రమల వారీగా వివరాలు సమర్పిస్తామని చెప్పడంతో విచారణను ఈ నెల 3కి వాయిదా వేసింది.