హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్‌

తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలు భారీగా జరుగుతున్నాయి. తాజాగా వినాయకచవితి రోజున ఐదుగురు ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ను నియమించగా, మొన్నటి వరకూ సీపీగా కొనసాగిన కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు పర్సనల్‌ ఏడీజీగా ఉన్న విజయ్‌ కుమార్‌ను ఏసీబీ ఏడీజీగా, ఆయన స్థానంలో లా అండ్‌ ఆర్డర్‌ ఏడీజీ మహేశ్‌ భగవత్‌ను నియమించింది. ఇక పోలీస్‌ స్పోర్ట్స్‌ ఐజీగా ఎం రమేశ్‌కు సైతం అదనపు బాధ్యతలు అప్పగించింది. అయితే, ఇటీవల హైదరాబాద్‌లో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా అదుపు తప్పడం, అడ్డూ అదుపులేకుండా నేరాలు పెరిగిపోతుండటం, పోలీసులే లంచాల్లో మునిగి తేలుతుండగా.. సీపీ ట్రాన్స్‌ఫర్లు మాత్రమే చేస్తుండేవారు. నేరాల అదుపులో పురోగతి లేకపోవడంతో సీవీ ఆనంద్‌ను మళ్లీ హైదరాబాద్‌ సీపీగా తీసుకొచ్చినట్టు సమాచారం. దీంతోపాటు సమర్థుడైన అధికారిగా పేరున్న జయ్‌కుమార్‌ను పోలీసు పర్సనల్‌ అదనపు డీజీగా ఉంచడం.. పోలీసు వర్గాల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవడంతో అతన్ని అవినీతి నిరోధకశాఖ అదనపు డీజీగా నియమించినట్టు తెలిసింది.