- తెలంగాణ రాష్ట్రంలో దూకుడు పెంచిన ఏసీబీ
- ఈ ఏడాది ఇప్పటికే సెంచరీ దాటిన కేసులు
- రోజూ 20 నుంచి 30 ఫిర్యాదులు వస్తున్నాయంటున్న ACB అధికారులు
- లంచం తీసుకుంటూ చిక్కితే సమాజంలో చులకనవుతారు.
- అవినీతి కేసుతో ఇంటిల్లిపాదికీ మానసిక క్షోభ
- అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ అవినీతే…
అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ అవినీతే…
రవాణా శాఖ చెక్ పోస్టుల్లో ఓపెన్ వసూళ్లు నడుస్తున్నాయి. అప్పుడప్పుడు ఏసీబీ దాడులు జరుగుతున్నా ఆ శాఖలో మార్పు రావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, ప్రభుత్వ పనులకు సంబంధించిన చెల్లింపులన్నీ ట్రెజరీ శాఖ ద్వారానే జరుగుతాయి. అయితే ట్రెజరీ శాఖలో ఏళ్లుగా వేళ్లూనుకున్న అవినీతి ఎప్పటికీ తగ్గడం లేదు. ట్రెజరీ ఆంటేనే వసూళ్లకు నిలయమన్న పేరుంది. మున్సిపల్ శాఖలో కూడా అడుగడుగునా అవినీతి తాండవిస్తోంది. ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాలకు వెళితే డబ్బులు ముట్టజెప్పితే గానీ పనులు జరగడం లేదు. అనుమతి లేని ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఎల్ఆర్ఎస్ ను అమలు చేస్తుండగా అందులోనూ చేయి తడిపితేగాని పనులు జరగడం లేదు. పౌరసరఫరాల శాఖలో అడ్డగోలుగా అవినీతి జరుగుతోంది. పేదలకు అందించే రేషన్ బియ్యం అక్రమ మార్గాల ద్వారా నల్లబజారుకు తరలుతోంది. డీలర్లు, అధికారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. అలాగే అభివృద్ధి పనులకు సంబంధించి పంచాయతీరాజ్, నీటి పారుదల, రోడ్లు భవనాలు, ఆర్ డబ్ల్యూఎస్ వంటి శాఖల్లో కాంట్రాక్టర్లు పర్సంటేజీలు ఇవ్వడం షరామామూలే, అధికారి, సిబ్బంది. స్థాయిని బట్టి ముందే నిర్ణయించుకున్న ప్రకారంగా పర్సంటేజీలు ముట్టజెప్పాల్సిందే. పొల్యూషన్ బాధితుల గోడు అర్దం చేసుకోవాల్సిన పీసీబీ (PCB) అధికారులు పరిశ్రమల యజమాన్యలతో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. పరిశ్రమలను చక్కదిద్దాల్సిన డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ లో అవినీతి తాండవిస్తుంది. మైనింగ్ శాఖ, అటవీ శాఖ ఇవేగాక ఇతర శాఖలలో కూడా డబ్బులతోనే పనులు జరుగుతుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చేయి తడిపితేనే పనులు జరుగుతాయన్న భావన అందరిలోనూ పెరిగిపోయింది. ఆన్ లైన్ అయినా, ఆఫ్ లైన్ అయినా డబ్బులే డామినేట్ చేస్తున్నాయి.
ఉదాహరణకు కొన్ని సంఘటనలు.. మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే ఉద్యోగి ఇంట్లో రూ.కోట్లల్లో నగదు. రూ.కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు దొరికాయంటే మామూలు విషయం కాదు. ఆ నోట్ల కట్టలను చూసి ఏసీబీ అధికారులే విస్తుపోయారు. ఇది నిజామాబాద్ నగరంలో ఇటీవల వెలుగు చూసిన ఓ కేసు ఉదంతమిది. కొన్నేళ్లుగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులను మేనేజ్ చేసుకుని కార్పొరేషన్ ను సొంత జాగీరుగా మార్చుకుని అక్రమాలకు పాల్పడిన ఆ అధికారి ఆఖరుకు జైలులో చిప్పకూడు తినాల్సి వచ్చింది.
ఇలాంటి ఆక్రమార్క అధికారులపై ఏసీబీకి ప్రతి రోజూ 20 నుంచి 30 ఫిర్యాదులు వస్తున్నాయని ఇటీవల ఆ శాఖ అధికారులు వెల్లడించారు. గడచిన ఎనిమిది నెలల కాలంలో ఏసీబీ కేసుల సంఖ్య సెంచరీ దాటింది. లంచం తీసుకుంటూ దొరికిన వారు కొందరైతే, ఆక్రమంగా ఆస్తులు కూడబెట్టుకుని అక్రమాస్తుల కేసులో అరెస్టయినవారు కొందరున్నారు. ఒక్కో కేసులో ఇద్దరు, ముగ్గురు కూడా చిక్కిన ఘటనలున్నాయి.
అయినా.. మారడం లేదు
లంచం… ప్రభుత్వ కార్యాలయాల్లో ఇదో పెద్ద జాఢ్యం. పని ఏదైనా సరే చేయి తడిపితేనే పనులు జరుగుతాయి. పైసలు ఇస్తేనే ఫైళ్లు ముందుకు కదులుతాయి, కొందరు అధికారులు, సిబ్బంది డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతున్న పరిస్థితుల్లో అడిగినంత లంచం ఇచ్చుకోలేక కొందరు, ఎందుకు ఇవ్వాలని కొందరు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. దాంతో అవినీతిపరులు ఏసీబీకి చిక్కి జైలుపాలై, ఉద్యోగం పోయి రోడ్డున పడుతున్నారు. ఇలాంటి వాళ్లను చూసైనా అవినీతి సొమ్ముకు అర్రులు చాచే వారు వెనక్కు తగ్గడం లేదు. ఇంటి పెద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కితే ఆ కుటుంబం కూడా మానసిక క్షోభకు గురవుతోంది. ఇటీవలి కాలంలో అవినీతి నిరోధక శాఖ తమకు అందే ఫిర్యాదులపై ఎక్కువగా ఫోకస్ చేస్తుండడంతో వరుసగా ఏసీబీ కేసులు నమోదవుతున్నాయి. గతంలో ఏసీబీ కేసులో అరెస్టయిన వారు వెంటనే బెయిల్ పై బయటకు వచ్చే అవకాశాలుండేవి. అయితే ఏసీబీకి చిక్కిన వారు సులువుగా తప్పించుకోకుండా పక్కా ఆధారాలు, సాక్ష్యాలను నమోదు చేస్తున్నారు. దీంతో ఏసీబీకి చిక్కిన వారు కొంతకాలమైనా జైలు ఊచలు లెక్కబెట్టాల్సి వస్తోంది. ఏసీబీ కేసులో అరెస్టయ్యాడంటే చాలు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. ఒక్కోసారి ఏసీబీ కేసు తేలేవరకు ఉద్యోగంలో చేరే పరిస్థితులు లేకుండాపోయి రోడ్డున పడాల్సి వస్తోంది. మొత్తంగా లంచం తీసుకుంటే చిప్పకూడు తినడానికి రెడీ అవ్వాల్సిందేనన్న సంకేతాలను ఏసీబీ అందిస్తోంది.
ఆన్ లైన్ సేవలకూ వసూళ్లు
ప్రభుత్వ సేవలను సులభతరం చేయడంలో భాగంగా ఆన్ లైన్ సేవలు అందిస్తున్నారు. అయితే ఆన్ లైన్ లో జరిగే పనులకు సైతం ఉద్యోగులు, అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు ఎక్కువగా అవసరమయ్యే రెవెన్యూ వ్యవస్థ అవినీతికి మారుపేరుగా నిలిచిపోయింది. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది భారీ ఎత్తున ఆక్రమాలకు, అవినీతికి పాల్పడినట్టు తేలింది. గతంలో ఒక్క కామారెడ్డి జిల్లాలోనే 20 మంది రెవెన్యూ ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లతో పాటు మ్యుటేషన్ ప్రక్రియలో జరిగే అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్ తెచ్చింది. దీని ద్వారా అవినీతి తగ్గుతుందని ప్రభుత్వం భావించింది. అయితే దాన్ని కూడా తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఇటీవల కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు లంచం ఇవ్వడం మా వల్ల కాదు బాబోయ్ అంటూ ఆందోళనకు దిగారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
అవినీతిలో పోలీసు శాఖతో రవాణా శాఖ పోటీ..
అవినీతిలో తరువాతి స్థానంలో ఉండే పోలీసు శాఖలో ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువచ్చింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేసింది. పోలీసు స్టేషన్లతో పాటు అన్ని కార్యాలయాలకు నిర్వహణ ఖర్చులతో పాటు కావలసిన సౌకర్యాలన్నీ కల్పించింది. సరికొత్త వాహనాలను అందించి వాటికి కావలసినంత డీజీల్, పెట్రోల్ సమకూర్చడంతో పాటు నిర్వహణ ఖర్చులు కూడా ఇస్తోంది. ఇన్ని చేసినా పోలీసు శాఖలో అవినీతి మాత్రం తగ్గడం లేదు. ఇక రవాణా శాఖలో ఓపెన్ కరప్షన్ నడుస్తోంది. డ్రైవింగ్ లైసెన్సు నుంచి వాహన రిజి స్టేషన్ వరకు ప్రతి దానికి ఓ ధర నిర్ణయించి వసూలు చేస్తున్నారు. రవాణా శాఖలో అవినీతిని తగ్గించేందుకు ప్రభుత్వం ఆన్ లైన్ సేవలను తీసుకు వచ్చింది. స్లాట్ బుక్ చేసుకుని కావలసిన పత్రాలు తీసుకువెళితే పని జరగాలి. కానీ అవినీతికి అలవాటుపడ్డ అధికారులు, సిబ్బంది దళారుల మధ్యవర్తిత్వంతో వసూళ్లకు పాల్పడుతూ పనులు చేస్తున్నారు. ఆన్ లైన్ వ్యవస్థ వచ్చినా దళారీ వ్యవస్థ అలాగే కొనసాగుతోంది.
ఆశపడితే జైలు, సస్పెన్షన్లు తప్పవు….
ఏసీబీ కేసుల్లో చిక్కిన వారిపై నమోదైన కేసులతో తినాల్సిందే. అరెస్టయితే చాలు వెంటనే సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేయడం, కేసు తేలిన తరువాతే తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడం జరుగుతోంది. చాలా మంది ఏసీబీ కేసుల్లో కనీసం ఏడాది, రెండేళ్ళు సస్పెన్షన్ లో ఉండిపోతున్నారు. ఆ సమయంలో కుటుంబం కూడా ఎంతో వేదనకు గురవుతుంది. ఏసీబీ దాడి జరిగిందంటే చాలు ఉన్న ఆస్తులన్నీ జప్తు అవుతున్నాయి. దానికి తోడు సమాజంలో చెడ్డపేరు రావడంతో కుటుంబాలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. అవినీతి సొమ్ముకు ఆశపడి ఏసీబీ కేసుల్లో ఇరుక్కుని అవస్థలు పడుతున్న వారిని చూసైనా మిగిలిన వాళ్లు మరాల్సిన అవసరం ఉంది.