వర్షం మాటున పరిశ్రమల కాలుష్యం

  • కాలుష్య పరిశ్రమల ఆగడాలకు అడ్డుకట్ట వేసేదేవరు…?
  • వర్షం నీటితో కలిపి భారీగా వ్యర్థ జలాల ప్రవాహం
  • అడ్డు అదుపులేకుండా భూగర్భ జలాలను కాలుష్యం చేస్తున్న పరిశ్రమలు
  • మృత్యువాత పడుతున్న మూగజీవాలు
  • పీసీబీ అధికారుల కనుసన్నల్లోనే వ్యర్థ జలాలు బయటకు..
  • పీసీబీ అధికారుల తీరుపై కాలుష్య బాధితుల ఆగ్రహం..
  • ముఖ్యమంత్రి, మంత్రులు, పలువురు ఉన్నతాధికారులను కలిసే ఆలోచనలో కాలుష్య బాధితులు, పర్యావరణ వేత్తలు

కాలుష్య పరిశ్రమల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. కాలుష్య జలాలతో ఎన్నో ఘటనలు జరిగినా పరిశ్రమల యాజమాన్యాల తీరు మాత్రం మారడం లేదు. పరిశ్రమల యాజమాన్యాలకు పీసీబీ అధికారులు తొత్తులుగా మారారని విమర్శలు వినిపిస్తున్నాయి. కాలుష్యంతో తీరని నష్టం జరుగుతున్నా పీసీబీ అధికారులు సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా కురుస్తుండడంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రసాయన పరిశ్రమలు వర్షం నీటితో కలిపి కాలుష్య వ్యర్థ జలాలను బహిరంగంగా బయటకు వదిలేస్తున్నాయి. దీంతో చెరువులు, కుంటలు పూర్తిగా కాలుష్యంగా మారుతున్నాయి. కాలుష్య జలాలను తాగిన మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. అయినా పరిశ్రమల యాజమాన్యాల తీరును ప్రశ్నించేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. పీసీబీ అధికారులు కాలుష్య పరిశ్రమల వైపు కన్నెత్తి చూడడం లేదు. కాలుష్య జలాలను వదులుతున్న పరిశ్రమల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక వాడల ప్రజలు కోరుతున్నారు.

ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రామిక వాడ, పటాన్ చెరువు, పాశమైలారం, మేడ్చల్, జడ్చర్ల సెజ్, బాలానగర్, షాద్ నగర్, చౌటుప్పల్, జీడిమెట్ల, నాచారం, మల్లాపూర్, జిన్నారం, గడ్డపోతారం, బీబీ నగర్, చిట్యాల లాంటి ప్రాంతాలలో కాలుష్య పరిశ్రమల ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోతుంది. కాలుష్య బాధిత ప్రాంతాల ప్రజల కష్టాలు అన్నీ, ఇన్నీ కావు కాలుష్య పరిశ్రమలు వదిలే కాలుష్యంతో భూగర్భ జలాలు విషంగా మారడమే కాకుండా.. గాలి కాలుష్యం కూడా విపరీతంగా చేయడంతో రకరకాల రోగాలతో బాధపడుతున్నాం అని వాపోతున్నారు. బొల్లారం మున్సిపాలిటీ, జిన్నారం, గుమ్మడిదల మండల్లాలోని కిష్టాయి పల్లి, గడ్డపొతారం, బొంతపల్లి, ఖాజీపల్లి, బొల్లారం, పటాన్ చెరువు, మేడ్చల్ మండల పరిధిలో మరియు చౌటుప్పల్ మండల పరిధిలోని దొతిగూడెం, కొయ్యలగూడెం ఇంకా అనేక గ్రామాలు కాలుష్య పరిశ్రమలు వదిలే వ్యర్ధ జలాల వరదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్య పరిశ్రమలు వర్షం పడుతున్న సమయంలో వ్యర్ధ జలాలను వదలడమే కాకుండా, గాలిలోకి కూడా కాలుష్యాన్ని విపరీతంగా వదులుతుండటంతో కాలుష్య పరిసర ప్రాంతాల ప్రజలు ఆ విషపు వాసనలతో నరకం చూస్తున్నాం అంటున్నారు.

ఇందులో మరి ముఖ్యంగా బొల్లారం పారిశ్రామిక వాడను మినీ ఇండియాగా కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం ఆర్ధికంగా ఎంత అభివృద్ది చెందిన కూడా ఇక్కడ నివసించే ప్రజలు పడే ఇబ్బందులను మాత్రం పట్టించుకునే నాదుడే లేడు. మరీ ముఖ్యంగా కొన్ని కాలుష్య పరిశ్రమల యాజమాన్యాలు వర్షాకాలం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. వర్షాలు పడుతుండటమే ఆలస్యం వారి వారి పరిశ్రమలో ఇంతకు ముందు నుంచే నిల్వ ఉంచిన వ్యర్ద జలాలను వర్షపు నీటితో కలిపేసి చుట్టూ ప్రక్కల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలోకి మరియు బోర్ల ద్వారా భూగర్భంలోకి వదులుతూ చెరువులను కుంటలనే కాకుండా భూగర్భ జలాలను కూడా విపరీతంగా కలుషితం చేస్తున్నారు అంటున్నారు. కాలుష్య ప్రాంతాల ప్రజలు పంట పొలాల కోసం, త్రాగు నీటి కోసం బోరులు వేస్తే అందులో నుంచి వచ్చే నీరు కూడా పూర్తిగా విషపు (పసుపు) వ్యర్ధ జలలే వస్తున్నాయి అని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య పరిశ్రమల పరిధిలోని చెరువులు, కుంటలలోని నీరు విషపు వ్యర్ద జలాలతో పూర్తిగా కలుషితం అయిపోయింది అంటున్నారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి కుంటలు, చెరువులు, నాలాల పక్కనే ఉన్న కాలుష్య పరిశ్రమలు రాత్రి అయ్యేదే ఆలస్యం గుట్టు చప్పుడు కాకుండా తమ దగ్గర నిల్వ ఉంచిన వ్యర్ధ జలాలను వీటిలోకి వదులుతున్నారు. ఈ పరిశ్రమలే కాకుండా సిమెంట్ పరిశ్రమలు కూడా విపరీతమైన కాలుష్యం చేస్తూ పక్కనే ఉన్న కృష్ణ నది స్వచ్చమైన నీటిని కూడా పాడుచేస్తున్నాయి. ఇలాంటి చర్యలతో పూర్తిగా స్వచ్చమైన నీరు కాస్తా వ్యర్ద జలాలుగా మరీ దేనికి పనికి రాకుండా పోవడమే కాక అక్కడ నివసించే ప్రజలకు, పశువులకు, పక్షులకు తాగు నీరు దొరకక విపరీతమైన కొరత ఏర్పడుతుంది అని వారి బాధను పలువులు పర్యావరణ వేత్తల దగ్గర వాపోతున్నారు.

ఈ కాలుష్య ప్రాంతాలలోని ప్రజలు విపరీతమైన కాలుష్య వ్యర్ద జలాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడి భూగర్భ జలాలు కలర్ కలర్ గా రావడమే కాకుండా ఈ జలల్లో 2000, 3000 టిడిఎస్ వస్తుంది. ఈ వాటర్ బట్టలు ఉతుకోవడం, స్నానం చేయడానికి కూడా పనికి రాని పరిస్థితి ఉందంటున్నారు. అన్ని అవసరాలకు నీరు కొనుగోలు చేయాలంటే తమ ఆర్ధిక పరిస్థితి సరిపోవడం లేదని అంటున్నారు. మంచి నీరు తెచ్చుకోవాలంటే 5 నుంచి 10 కిలో మిటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుంది అని తమగోడును వెళ్లబోసుకుంటున్నారు. తమ కాలుష్య బాధలను పట్టించుకోవాలని ఎన్ని సార్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు కాలుష్య పరిశ్రమలపై ఫిర్యాదు చేసిన సదరు పరిశ్రమలపై చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. ఈ కాలుష్య పరిశ్రమల వ్యర్ద జలాలను పటాన్ చెరువులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిఇటిపికు తరలించాలి. అక్కడ ఆ వ్యర్ధ జలాలను శుద్ది చేయడం జరుగుతుంది. ఈ వ్యర్ద జలాలను సిఇటిపికు తరలించాలి అంటే ఒక్క ట్యాంకర్ కు రూ.10 వేల రూ.15 వేల వరకు చెల్లించాల్సి ఉంటది. ఈ ఖర్చును తప్పించుకోవడానికి కాలుష్య పరిశ్రమలు వర్షపు నీటిలో ఈ వ్యర్ధ జలాలను కలిపి చెరువులు, కుంటలు, నాలాలు, భూగర్భంలోకి వదిలి స్వచ్చమైన నీటిని విషపు నీరుగా మారుస్తున్నారు.

అలాగే జిన్నారం మండలంలోని గడ్డపోతారం, బొల్లారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడల్లో సుమారు 300 రసాయన పరిశ్రమలు ఉంటాయి. ఇంటర్మీడియట్ స్థాయిలో తయారు చేసే పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. దీంతో భారీగా వ్యర్థ జలాలతో పాటు వాయు కాలుష్యం వెలువడుతుంది. జల, వాయు కాలుష్యాల నియంత్రణకు సంబంధిత యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చర్యలు ఏర్పాటు చేసేందుకు ఎక్కువగా ఖర్చు అవుతున్నది. కాలుష్య జలాల శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయకుండా యాజమాన్యాలు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు కాలుష్య జలాలను నిబంధనలకు విరుద్ధంగా యదేచ్చగా బయటకు వదిలేస్తున్నాయి. దీంతో సమీపంలోని చెరువులు, కుంటలు కాలుష్య జలాలతో నిండిపోతున్నాయి. పారిశ్రామికవాడల్లో గల మూగజీవాలు కాలుష్య జలాలు తాగి మృత్యువాత పడుతున్నాయి. రైతులకు న్యాయం చేయాలని స్థానిక నాయకులు ఎన్నిసార్లు యాజమాన్యాలను కోరిన పట్టించుకోవడం లేదు.

పీసీబీ అధికారుల తీరుపై ఆగ్రహం..

          భారీ స్థాయిలో కాలుష్య జలాలు బయటకు వెలువడుతున్నా పీసీబీ అధికారులు మాత్రం కాలుష్య పరిశ్రమల వైపు చూడడం లేదు. కాలుష్య జలాల విషయంలో పారిశ్రామికవాడల ప్రజలు పీసీబీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పరిశ్రమల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం లేదు. ఫిర్యాదు ఇచ్చిన సమయంలో నమూనాలను సేకరించి పరీక్షల పేరిట పీసీబీ అధికారులు కాలయాపన చేస్తున్నారు. దీంతో పీసీబీ అధికారుల తీరుపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీసీబీ ఈఈ లకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు. పీసీబీ టాస్క్ ఫోర్స్ అధికారులు అసలు ఉన్నారా..? లేరా..? ఉంటే ఇటువైపు కనబడడం లేదు అంటున్నారు.

మృత్యువాత పడుతున్న మూగజీవాలు..

కాలుష్య జలాలు సేవించిన మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. కిష్టాయిపల్లి గ్రామంలోని సాయి అనే రైతుకు చెందిన 16 గేదెలు వ్యర్థ జలాలు సేవించి మృతి చెందాయి. అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ రైతులు. స్థానిక ప్రజా ప్రతినిధులు హైదరాబాదులోని పీసీబీ మెంబర్ సెక్రటరీ కార్యాలయం ఎదుట మృతి చెందిన గేదెలతో నిరసన తెలిపారు. అయినా ఇప్పటి వరకు కాలుష్య జలాలను వదులుతున్న పరిశ్రమలను పీసీబీ అధికారులు గుర్తించలేదు. అధికారులు పరిశ్రమల యాజమాన్యాలకు ఎలా సహకరిస్తున్నారో అర్థమవుతోంది. ఇప్పటికైనా పీసీబీ అధికారులు స్పందించి కాలుష్య జలాలను వదులుతున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

వర్షం పడితే పరిశ్రమల యాజమాన్యాలకు పండగే..

రసాయన పరిశ్రమల యాజమాన్యాలకు వర్షాలు కురిస్తే పండగే. వర్షం పడుతున్న సమయంలో కాలుష్య జలాలను వర్షం నీటితో కలిపి బయటకు వదిలేస్తున్నాయి. వర్షం పడుతున్న సమయంలో పీసీబీ టాస్క్ ఫోర్స్ అధికారులు పారిశ్రామిక వాడల్లో పర్యటించాల్సి ఉంటుంది. టాస్క్ ఫోర్స్ అధికారులు మాత్రం ఇటువైపు రావడం లేదు. పీసీబీ అధికారుల కనుసన్నల్లోనే వ్యర్థ జలాలను బయటకు వదిలే ప్రక్రియ కొనసాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలుష్య జలాలను వదులుతున్న సమయంలో స్థానికులు గుర్తించి అధికారులకు ఫిర్యాదులు చేసిన వారు పట్టించుకోవడం లేదు. కాలుష్య జలాలను వదులుతున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక వాడల ప్రజలు కోరుతున్నారు. కాలుష్య పరిశ్రమలపై ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకొని పలువురు అవినీతి పిసిబి అధికారులపై ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి, ప్రిన్సిపాల్ సెక్రటరీ, పిసిబి ఛైర్మన్, ఎసిబి, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ లకు ఫిర్యాదు చేయాలని కాలుష్య బాధితులు, పలువురు పర్యావరణ వేత్తలు సిద్దమవుతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతేనే ఈ సమస్యకు ఓ పరిష్కారం దొరుకుతుందని కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే హైడ్రా లాంటి ఓ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తేనే కాలుష్యానికి, పిసిబి అధికారుల అవినీతికి అడ్డుకట్ట పడుతుందని కాలుష్య బాధితులు చెబుతున్నారు.