మేడారం జాతరను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం సందర్శించనున్నారు. ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకొని సమ్మక్క, సారలమ్మ తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకొంటారని అధికారులు తెలిపారు. గత జాతరలో సమ్మక్క-సారలమ్మ గద్దెలమీదకు చేరిన తర్వాతే సీఎం కేసీఆర్ తల్లులను దర్శించుకున్నారు. ఈ ఏడాది కూడా అదే ఆనవాయితీని పాటిస్తున్నారు. సీఎం రాక సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
వనదేవతల దర్శనం చేసుకునేందుకు శుక్రవా రం గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తొలిసారి మేడారం రానున్నారు. సీఎం కేసీఆర్ రావడానికి గంట ముందుగానే గవర్నర్ తల్లు లను దర్శించుకోనున్నారు. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకొని మొక్కులు చెల్లించుకొంటారు.