- రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సిందే
- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కోడిచర్ల, తీగాపూర్, గుండ్లపట్లపల్లి, రంగారెడ్డిగూడ, అప్పాజిపల్లి తండా గ్రామాల పరిసరాల్లో మానవ నివాసాలకు కిలోమీటరు పరిధి లోపల ఉన్న స్పాంజ్ ఐరన్ పరిశ్రమలను ఏడాదిలోగా తరలించాలంటూ ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరిశ్రమలను తరలించాక నివేదికను హైకోర్టు జ్యుడీషియల్ రిజిస్ట్రారు సమర్పించాలని ఆదేశించింది. అక్కడ మిగిలిన పరిశ్రమలు పర్యావరణ చట్టాలకు అనుగుణంగా నడుస్తున్నాయో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించి రెండు నెలల్లో నివేదిక అందజేయాలని ఆదేశించింది. పంట నష్ట పరిహారంగా పరిశ్రమలు డిపాజిట్ చేసిన సొమ్మును రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంకా స్పాంజ్ ఐరన్ పరిశ్రమలతో పంట నష్టపోయిన రైతులు ఉంటే చట్టప్రకారం వారిని గుర్తించి పరిహారం అందజేయాలని ఆదేశిస్తూ 19 ఏళ్ల పిటిషన్ పై విచారణను ముగించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కోడిచర్ల, తీగాపూర్, గుండ్లపట్లపల్లి, రంగారెడ్డిగూడ, అప్పాజిపల్లి తండా గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో స్పాంజ్ ఐరన్ పారిశ్రామిక యూనిట్లు నిర్వహిస్తుండటాన్ని సవాలు చేస్తూ 2005లో షాద్ నగర్ కు చెందిన టి.వీరేందర్ రెడ్డి మరో 8 మంది ప్రజాప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ పరిశ్రమల కాలుష్యం వల్ల పంటలు దెబ్బతింటున్నాయని. వ్యవసాయం చేయలేకపోతున్నట్లు తెలిపారు. పచ్చదనం హరించుకుపోతోందని, ప్రజలు ఆనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. కాలుష్య నివారణకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు చర్యలు తీసుకోవడంలేదని పేర్కొన్నారు.
దీనిపై హైకోర్టు ఆదేశాల మేరకు పీసీబీ నివేదికను సమర్పించింది. జైసీ స్పాంజ్ ప్రొఫైల్స్ ప్రైవేట్ లిమిటెడ్, తిరుపతి ఉద్యోగ్ లిమిటెడ్, జి.కె. స్పాంజ్ ఐరన్ ప్రైవేట్ లిమిటెడ్, శీతల్ షిప్పింగ్ అండ్ మెటల్ ప్రాసెసర్స్ లిమిటెడ్, బింజు మెటల్స్ అండ్ అలాయ్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, హార్మొనీ స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ, శివరాత్రి ఫెర్రో అల్లాయ్స్, ఏపీఎస్ఎం అల్లాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్, దేవశ్రీ ఇస్పాత్ లిమిటెడ్ లు పనిచేయడంలేదని పేర్కొంది. బిలస్రాయికా స్పాంజ్ ఐరన్ ఇండియా, బింజుసారియా స్పాంజ్ అండ్ పవర్, ఆనంద్ మెటాలిక్స్ అండ్ పవర్, సుందర్ ఇస్పాత్ లిమిటెడ్, వినాయక స్టీల్స్, రాయిటర్ మెటల్స్ ఆఫ్ ఇండియా, కేడియా అల్లాయ్స్ లిమిటెడ్, సిరి శివశక్తి స్టీల్స్ అల్లాయ్స్ లు ఎన్జీటీని ఆశ్రయించాయని, దీనిపై 2022లో ఎన్జీటీ ఉత్తర్వులు జారీచేస్తూ జనావాసాలకు కి.మీ. లోపు ఉన్నవాటిని తరలించాలని ఆదేశించిందని తెలిపింది. టీఎస్ ఐఐసీ 2020లో ప్రణాళిక సమర్పిస్తూ నివాస ప్రాంతాలకు సమీపంలో ఉన్న ఆనంద్ మెటాలిక్స్ అండ్ పవర్, సుందర్ ఇస్పాత్ లిమిటెడ్, వినాయక స్టీల్స్, రాయిటర్ మెటల్స్ ఆఫ్ ఇండియా, కేడియా అల్లాయ్స్ లిమిటెడ్, సిరి శివశక్తి స్టీల్స్ అల్లాయ్స్ లను మరోచోటికి తరలించాలని సిఫారసు చేసిందని తెలిపింది. బిలస్రాయికా స్పాంజ్ ఐరన్ ఇండియా, బింజుసారియా స్పాంజ్ అండ్ పవర్, రాయిటర్స్ మెటల్స్ ఆఫ్ ఇండియా పరిశ్రమలు జనావాసాలకు కిలోమీటరు కంటే ఎక్కువ దూరంలో ఉన్నట్లు వివరించింది. వీటన్నింటినీ పరిశీలించిన ధర్మాసనం జనావాసాలకు కిలోమీటరు దూరంలో లోపల ఉన్న స్పాంజ్ ఐరన్ పరిశ్రమలను తరలించి నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ పిటిషన్ పై విచారణను మూసివేసింది.