- ప్రమాదపుటంచున కార్మికుల బతుకులు
- భద్రతా ప్రమాణాలు పాటించని యాజమాన్యాలు.. పట్టించుకొని ఇన్స్ ఫెక్టరాఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు..
- అధికారుల సమయం అంతా వసూళ్ల పైనే..
- కార్యాలయాల్లో ఎప్పుడూ అందుబాటులో ఉండరు..
- పరిశ్రమలలో ఇన్స్ ఫెక్టరాఫ్ ఫ్యాక్టరీస్ అధికారుల తనిఖీలు అంతంతే..
- ఏసీబీ, విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు ఫిర్యాదులు చేయాలని పర్యావరణ వేత్తల నిర్ణయం..
“రాజకీయ పలుకుబడి, లంచాలకు లోంగే అధికారులు ఉంటే.. అమాయకుల ప్రాణాలు దారుణంగా బలితీసుకునే అధికారం పరిశ్రమల యజమాన్యలకు ఉంటుందా..? ఆవిధంగా ఏదైనా చట్టం ఉందా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. కార్మికులకు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా.. పరిశ్రమల యాజమాన్యాలు నిరాటంకంగా తమ పనులను తాము చేసుకుంటూ పోతున్నారు. ఈ అన్యాయాలను అక్రమాలను నిరోధించే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది..? ఎవరు అబాధ్యతలు తీసుకుంటారు..? ఇలాంటి జవాబు లేని ప్రశ్నలు ఎన్నోన్నో..” వాటికి సమాధానం రావాలంటే (Department of Factories)లోని అవినీతి అధికారులపై ఏసీబీ, విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు ఫిర్యాదులు చేయాలని పలువురు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు కొరవడటంతో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి ఎలాంటి సేఫ్టీ తీసుకోకుండానే కార్మికులతో యాజమాన్యాలు పనులను చేయిస్తున్నాయి. ఈ క్రమంలో కార్మికులు అనుకోకుండా ప్రమాదాలతో మృత్యువాత పడుతున్నారు. ఆయా పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల భద్రతకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో పర్యవేక్షించాల్సిన ఇన్స్ ఫెక్టరాఫ్ ఫ్యాక్టరీస్ అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని, పరిశ్రమల యాజమాన్యాలకు తొత్తులుగా మారుతున్నారని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్ లోనైనా కార్మికులు ప్రాణాలు కోల్పోకుండా యాజమాన్యాలు భద్రతా చర్యలు తీసుకునేలా అధికారులు తనిఖీలు చేయాలని కోరుతున్నారు.
సంగారెడ్డి, జిన్నారం, గడ్డపోతారం, ఐడీఏ బొల్లారం, బొంతపల్లి, పటాన్ చెరు, ఖాజీపల్లి, పాశమైలారం, నాచారం, జీడిమెట్ల, మహబూబ్ నగర్, బాలాపూర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, కాటేదాన్, సనత్ నగర్, బాలా నగర్, రాజేంద్ర నగర్, తాండూరు, పోలేపల్లి, కొందుర్గు, యద్రాద్రి భువనగిరి, నల్లగొండ, దొతిగూడెం, చోటుప్పల్, సూర్యాపేట వంటి ప్రాంతాల్లో ఉన్న అనేక రసాయన పరిశ్రమల్లో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నా రెగ్యులర్ గా తనిఖీలు చేయాల్సిన అధికారులు మాత్రం మముళ్ల మత్తులో జోగుతున్నారు అని పర్యావరణ వేత్తలు చెబుతున్న మాట. ఉదాహరణకు ఒక్క జీడిమెట్ల పారిశ్రామికవాడలో సుమారు 1000కి పైగా పరిశ్రమలు ఉన్నాయి. కాగా వీటిల్లో ఫార్మా, బల్క్ డ్రగ్, ఇంజనీరింగ్, రీసైక్లింగ్ పరిశ్రమల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిశ్రమల్లో ప్రతిరోజు రెగ్యులర్ పనులతో పాటు మెయింటెనెన్స్ పనులు జరుగుతూనే ఉంటాయి. పరిశ్రమల నిబంధనల ప్రకారం పరిశ్రమలో కార్మికుడు పనిచేసే క్రమంలో భద్రతా ప్రమాణాలు పాటించేలా యాజమాన్యాలు చూడాలి. కానీ కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు పనులను కాంట్రాక్టర్ కు అప్పగించి చేయించుకుంటున్నాయి. ఏమైనా ప్రమాదం జరిగితే యాజమాన్యానికి, తమకు బాధ్యత కాదంటూ ముందుగానే కార్మికులతో పేపర్లపై సంతకాలు తీసకుంటున్నారు. సదరు కాంట్రాక్టర్ ఎలాంటి సేఫ్టీ పద్దతులు లేకుండానే కూలీలతో పనులు చేయిస్తున్నారు. ప్రమాదంలో ఎవరైనా కార్మికులు చనిపోతే మృతుడి కుటుంబానికి కాంట్రాక్టర్ మానవతా దృక్పథంతో కొంత చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు.
కన్నెతి చూడని ఇన్స్ ఫెక్టరాఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు..!
పరిశ్రమలో పనులు చేయించుకునే క్రమంలో కాంట్రాక్టర్ లేదా పరిశ్రమ యాజమాన్యం కార్మికుల భద్రతా ప్రమాణాలు పాటించేలా అధికారులు తనిఖీ చేయాలి. కార్మికులకు హెల్మెట్, హైరిస్క్ మాస్కులు, బూట్లు, కళ్లద్దాలు ఇవ్వకుండానే కార్మికులతో పనులు చేయిస్తున్నారు. పై అంశాలను పాటిస్తున్నారా..? లేదా..? అని తనిఖీ చేయకుండా సంబంధిత అధికారులు యాజమాన్యాలు ఇచ్చే కానుకలకు, లంచాలకు అలవాటు పడ్డారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
మచ్చుకు కొన్ని ప్రమాదాల వివరాలు :
గడిచిన 5 సంవత్సరాల్లో జీడిమెట్ల పారిశ్రామికవాడలో రసాయన రియాక్టర్లు, బాయిలర్స్ శుభ్రం చేసే క్రమంలో వివిధ పరిశ్రమల్లో 20 మంది కార్మికులు మృతి చెందారు. 10 మందికి పైగా గాయపడ్డారు..
* 2021 జూలై 17 జీడిమెట్ల ఫేజ్-5లోని ఆర్ట్ ల్యాబ్ పరిశ్రమలో యశోదా అనే స్వీపర్ మంటల్లో చిక్కుకుని చనిపోయింది.
* 2021 జూలై 28న నాసెన్స్ ల్యాబ్ పరిశ్రమలో రసాయన బాయిలర్ పేలి షిఫ్ట్ ఇన్చార్జి హరి ప్రసాద్ రెడ్డి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మరో ఇద్దరు కార్మికులు నందకిషోర్, అర్జున్ లకు గాయాలయ్యాయి.
* 2022 జనవరి 28న జీడిమెట్లలోని అట్టల పరిశ్రమ వద్ద అన్ లోడింగ్ చేస్తుండగా బండిల్ మీద పడి కమలాకర్ రెడ్డి అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
* 2022 డిసెంబర్ 12 న బొల్లారంలోని వింధ్య ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో రియాక్టర్ పేలడంతో అందులోని రసాయనాలు పడి 8 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
* 2023 జనవరి 30న గంపల బస్తీలో డ్రమ్ము పేలి విజయ్ ప్రజాపత్ అనే కార్మికుడు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు.
* 2023 ఫిబ్రవరిలో కార్తికేయ కామేశ్వర రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి శ్రీరాములు అనే కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు.
* 2023 మార్చిలో ఆరోరా ఫార్మా పరిశ్రమలో రియాక్టర్ శుభ్రపరుస్తుండగా కుమార్ సరెన్, నరేంద్ర అనే ఇద్దరు కార్మికులు మృతి చెందారు.
* 2023 నవంబర్ 12న శ్రీశ్రీ కెమికల్స్ పరిశ్రమలో నుంచి వెలువడిన రసాయనాలతో ఐదుగురు పక్క పరిశ్రమ కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.
* 2024 ఏప్రిల్ 4న బాలాజీ ఇంజనీరింగ్ పరిశ్రమలో క్రేన్ సాయంతో రియాక్టర్ లిఫ్ట్ చేయగా.. అది మీద పడి జనార్దన్ నాయుడు అనే కార్మికుడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
* 2024 అక్టోబర్ 16న సాబూరి ఫార్మా పరిశ్రమలో ప్యాబ్రికేషన్ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు వ్యాక్యూం ట్యాంక్ లో పడి రామ్, లక్ష్మణ్ అనే కవలలు అయిన ఇద్దరు కార్మికులు మతి చెందారు. సురేందర్ రెడ్డి అనే కార్మికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
ఇన్స్ ఫెక్టరాఫ్ ఫ్యాక్టరీస్ (Department of Factories)లోని కొంత మంది అవినీతి అధికారుల బాగోతన్ని పూర్తి (పేర్లతో) ఆధారాలతో సహా త్వరలో మీ ముందుకు తీసుకువస్తుంది. ‘‘నిఘానేత్రం న్యూస్‘‘ మా నిఘానేత్రం న్యూస్ పేదోడి పక్షం… అవినీతిపైనే మా పోరాటం…