కాలుష్య పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవు : పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి

ఆక్రమంగా గాలి, నీరు, భూమిలోకి రసాయన వ్యర్ధాలు, విష వాయువులను వదిలి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కాలుష్య పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ రవి హెచ్చరించారు. రసాయన వ్యర్ధాలు, విష వాయువులు, దుర్వాసనలను నిలువరించడంలో పరిశ్రమల సంఘాలు క్లస్టర్ల వారీగా కీలక పాత్ర పోషించాలని సూచించారు. సనత్ నగర్ లోని టీజీపీసీబీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పరిశ్రమల యజమానులు, సంఘాల ప్రతినిధులు, అధికారులతో కలిసి మెంబర్ సెక్రటరీ రవి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెంబర్ సెక్రటరీ రవి మాట్లాడుతూ కాలుష్య నిబంధనలను ఉల్లంఘించిన వారిని గుర్తించని పక్షంలో ఆ ప్రాంతంలోని అధికారులు, సభ్యులు అందరిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రతీ పరిశ్రమ తమ స్వీయ పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పీసీబీ అధికారులంతా తరచూ తనిఖీలు నిర్వహించడం ద్వారా కాలుష్య ఉద్గారాలను విడిచిపెట్టే పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలుష్య నియంత్రణ ప్రజారోగ్యానికి పరిశ్రమలు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే కొన్ని పారిశ్రామిక యూనిట్ల నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా స్థానిక నివాసితులు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు పలు పిర్యాదులు అందుతున్నాయన్నారు. వాటిని పరిశీలించి సంబంధిత పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామన్నారు. పీసీబీ చీఫ్ ఇంజినీర్ రఘు, వివిధ పరిశ్రమల యజమానులు, పారిశ్రామిక సంఘాల, ప్రతినిధులు పాల్గొన్నారు.