అక్రమాస్తుల కేసులో ఏఈఈ నిఖేశ్‌ కుమార్‌ అరెస్ట్‌.. 14 రోజులు రిమాండ్‌

అక్రమాస్తుల కేసులో నీటి పారుదల శాఖ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (AEE) నిఖేశ్​కుమార్‌ను ఏసీబీ అరెస్టు చేసింది. అనంతరం జడ్జి ముందు హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్​ రిమాండ్​ విధించారు. దీంతో అధికారులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. రంగారెడ్డి జిల్లా నీరు పారుదల శాఖ ఏఈఈగా పని చేస్తున్న నిఖేశ్‌ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించింది. దీంతో శనివారం ఉదయం గండిపేట మండలం పీరంచెరువు పెబెల్‌సిటీ గేటెడ్‌ కమ్యూనిటీలో ఉన్న ఆయన ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. అతని బంధువులు, సన్నిహితులకు సంబంధించిన 19 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి అక్రమాస్తుల దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ క్రమంలో నిఖేశ్‌కు మెయినాబాద్‌లో 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, మూడు ఫామ్‌ హౌస్‌లు, శంషాబాద్‌, మియాపూర్‌లో 2 కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయనతోపాటు బంధువుల పేరుతో భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వం విలువ ప్రకారమే వాటి విలువ రూ.17.73 కోట్లు అని తేల్చారు. బహిరంగ మార్కెట్​ విలువలో దాదాపు రూ.170 కోట్లు దాటొచ్చని అంచనా వేస్తున్నారు.