మావోస్టుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన డీజీపీ జితేందర్‌

ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌ చేశారని పలువురు పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి.. ఆ తర్వాత ఎన్‌కౌంటర్‌ చేశారనే ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ డీజీపీ జితేందర్‌ స్పందించారు. మావోయిస్టులపై విష పదార్థాలను ప్రయోగించామనేది దుష్ప్రచారమన్నారు. మావోయిస్టులు స్పృహ కోల్పోయాక కాల్పులు జరుపామనడం అవాస్తవమని.. మావోయిస్టులు అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు జరిపారన్నారు. పెట్రోలింగ్‌ చేస్తున్న సమయంలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారని.. పోలీసుల కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారని చెప్పారు. హైకోర్టు, ఎన్‌హెచ్‌ఆర్‌సీ సూచనల మేరకే శవ పరీక్షలు నిర్వహించామని.. ఎన్‌కౌంటర్‌ కేసు దర్యాప్తు అధికారిగా వేరే జిల్లా డీఎస్పీని నియమించినట్లుగా వివరించారు.

అయితే, ఆదివారం తెల్లవారు జామున ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ మహిళా మావో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నర్సంపేట-ఇల్లందు ఏరియా కమిటీ కార్యదర్శి కుర్సం మంగు అలియాస్‌ భద్రు, ఏటూరునాగారం-మహాదేవ్‌పూర్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఈగోలపు మల్లయ్య అలియాస్‌ మధు సైతం ఉన్నారు. మధు స్వస్థలం పెద్దపల్లి జిల్లా రాణాపూర్‌ కాగా, మిగతా ఆరుగురు ఛత్తీస్‌గఢ్‌ జిల్లాకు చెందిన వారే. పీఎల్‌జీఏ వారోత్సవాల సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌‌ -తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం ప్రాంతంలో గ్రేహౌండ్స్‌, స్పెషల్‌ పార్టీ పోలీసులు పెట్రోలింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 6.16 గంటల ప్రాంతంలో చెల్పాక-ఐలాపూర్‌ అభయారణ్యంలోని పోలకమ్మవాగు సమీపంలో మావోలు, బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. దాదాపు అరగంటకుపైగా కాల్పులు జరిగినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత సంఘటనా స్థలంలో ఏడుగురు మావోల మృతదేహాలను గుర్తించారు. ఘటనాస్థలిలో రెండు ఏకే-47 తుపాకులు, 303 రైఫిల్‌, ఇన్సాస్‌ తుపాకీ, ఎస్‌బీబీఎల్‌ గన్‌, సింగిల్‌షాట్‌ తుపాకీ, తపంచా, కిట్‌బ్యాగులు, విప్లవ సాహిత్యం తదితర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో పిటిషన్‌ పౌరహక్కుల సంఘం నేతలు లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఏడుగురు మావోయిస్టులను బూటకపు ఎన్‌కౌంటర్‌ చేశారని పౌరుల హక్కుల సంఘం నేతలు ఆరోపించారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి కస్టడీలోకి తీసుకున్నారని.. ఆ తర్వాత చిత్రహింసలకు గురి చేసి ఎన్‌కౌంటర్‌ చేసినట్లు పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మావోయిస్టుల మృతదేహాలపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని.. మృతదేహాలను కుటుంబీకులకు చూపకుండా పోస్టుమార్టానికి తరలించారని చెప్పారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించినట్లుగా ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌పై విచారణ జరపాలని.. వైద్య నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం చేయడంతో పాటు వీడియో రికార్డింగ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు.