తెలంగాణ రాష్ట్రానికి 7,592 కోట్ల పెట్టుబడులు : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

 తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు 3 కంపెనీలు ముందుకొచ్చాయి. రూ.7,592 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీల ప్రతినిధులు ఆదివారం హైదరాబాద్‌లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ కంపెనీల ద్వారా దాదాపు 5,200 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీజీఐఐసీ) చైర్‌పర్సన్‌ నిర్మలా జగ్గారెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, డైరెక్టర్‌ మల్సూర్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ-సేవ మొబైల్‌ యాప్‌ ఆవిష్కరణ
అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మీ-సేవ మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించారు. పౌరసేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని, ఇందులో మొత్తం 150 రకాల పౌరసేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ యాప్‌ ద్వారా ప్రజలు ఏ సమయంలోనైనా, ఎక్కడినుంచైనా వివిధ రకాల సేవలను పొందవచ్చని చెప్పారు. త్వరలో మాల్స్‌, ఎయిర్‌పోర్టులు, మెట్రో స్టేషన్లు, సమీకృత కలెక్టరేట్లు తదితర ప్రాంతాల్లో మీ-సేవ కియోస్క్‌లను ఏర్పాటు చేయనున్నామని, మీ-సేవ ద్వారా లభ్యమయ్యే సేవలను ఈ కియోస్క్‌ల ద్వారా కూడా పొందవచ్చని తెలిపారు.

టీ-ఫైబర్‌ ప్రారంభం
టీ-ఫైబర్‌ ఇంటర్నెట్‌ సేవలను కూడా మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. అనంతరం ఆయన ఇంటర్నెట్‌ ద్వారా సంగారెడ్డి జిల్లా శ్రీరాంపూర్‌ వాసులతో మాట్లాడారు.