- నేడు అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం
డబ్బు లిస్తేనే ఫైల్ కదులుతుంది.. ఆక్రమం సక్రమం అవుతుంది.. ప్రతి దానికి ఎంతోకొంత ఇచ్చుకుంటే తప్ప పనులు కాని పరిస్థితి. ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో అంతకంతకూ అవినీతి పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ దాడులు, ట్రాప్ లలో వెలుగు చూస్తున్న అవినీతి బాగోతాలు చూస్తే కొందరు ఉద్యోగులు ఆవినీతితో కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా వెలుగు చూసిన నీటిపారుదలశాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిఖేశ్ కుమార్ ఉదంతమే ఉదాహరణ. రాష్ట్రవ్యా ప్తంగా నమోదవుతున్న ఏసీబీ కేసుల్లో 20 శాతం హైదరాబాద్ లోనే ఉంటుండటం గమనార్హం. జీహెచ్ ఎంసీ, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, విద్యుత్, హెచ్ఎండీఏ, పోలీసు సహా ప్రజా పనులతో ముడిపడి ఉన్న కీలక శాఖలో డబ్బులిస్తే తప్పపనులు జరిగే పరిస్థితి లేకుండా ఉంది. పారదర్శక విధానాలు తీసుకువస్తున్నా అవినీతికి అడ్డుకట్ట పడటంలేదు. అధికారులు తమ విచక్ష ణాధికారాన్ని ఉపయోగించుకుని అవినీతికి తెరతీస్తున్నారు. అవినీతి నిరోధకశాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, లోకాయుక్త వంటి వ్యవస్థలున్నా ఆవినీతికి అడ్డుకట్ట పడటంలేదు. ఏసీబీకి పట్టుబడిన అధికారులే మళ్లీ మళ్లీ అవినీతికి పాల్పడుతూ పట్టుబడుతున్నారు.