వాయు కాలుష్యంతో సతమతమవుతున్నాం : పిఎసిఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి

  • కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోండి
  • RC పురం JCEE శ్రీనివాస్ రెడ్డికి మొరపెట్టుకున్న తెల్లాపూర్ విల్లావాసులు

కాలుష్యకారక పరిశ్రమలు వెదజల్లుతున్న విషవాయువులతో నిత్యం సతమతమవుతున్నామని, వెంటనే కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని తెల్లాపూర్ లోని పలు విల్లాలవాసులు వేడుకుంటున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మైహోం అంకురా విల్లా ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోరుగంటి శ్రీధర్, తెల్లాపూర్ పిఎసిఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, త్రిదశ వాల్లాల ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తదితరుల సమక్షంలో శుక్రవారం కాలుష్య నియంత్రణ మండలి రామచంద్రపురం జోనల్ కార్యాలయంలో JCEE శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రతిరోజు సాయంత్రం వేళల్లో ఘాటైన వాయువులు వస్తుండడంతో ఊపిరి పీల్చుకోవడం కష్టతరంగా మారిందని, పలుమార్లు దీనిపై ఫిర్యాదు చేసినప్పటికి ఫలితం లేకుండా పోతోందన్నారు. నిత్యం విషయవాయువులను వెదజల్లుతున్న పరిశ్రమలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేలాది మంది నివాసముంటున్న ప్రాంతంలో విషవాయువుల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరగడంతో పాటు చిన్న పిల్లలు, వృద్ధులు గాలి పీల్చుకునేందుకు అవస్థలు పడుతున్నారని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తెల్లాపూర్ ని గేటెడ్ కమ్యూనిటీ విల్లాల్లో ఉండలేని స్థితివస్తుందని, ఈ విషయాన్ని అన్ని శాఖల అధికారులు గ్రహించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు విషవాయువులను వెదజల్లుతున్న పరిశ్రమలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను చేయాల్సి వస్తుందన్నారు.