సింగరేణి కాలుష్యానికి ఒకరి బలి

  • సైలో బంకరే కారణమంటూ తుకారాం సెల్ఫీ వీడియో
  • మృతదేహంతో కిష్టారంలో స్థానికుల ఆందోళన

సింగరేణి కాలుష్యంతో ఊపిరితిత్తులు దెబ్బతిని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్నది. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలోని అంబేద్కర్‌ కాలనీకి చెందిన బుర్రా తుకారాం (38) కొంతకాలం క్రితం అనారోగ్యానికి గురై హైదరాబాద్‌ గాంధీ దవాఖానలో చికిత్స పొంది ఇటీవలే ఇంటికి చేరుకున్నాడు. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో తిరిగి గురువారం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో స్థానికులు ఖమ్మం దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు.

తుకారాం గతంలో గాంధీ దవాఖాన లో చేరడానికి ముందు ఓ సెల్ఫీ వీడి యో తీసుకున్నాడు. తన అనారోగ్యాని కి పూర్తి బాధ్యత తమ కాలనీ ముందు సింగరేణి నిర్మించిన సైలో బంకరే కారణమని పేర్కొన్నాడు. ఆ బంకర్‌ నుంచి వెలువడే ధూళి, కాలుష్యం వల్లే తన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నదని వివరించాడు. సైలోబంకర్‌ను తొలగించాలని ఆ సెల్ఫీ వీడియోలో డిమాండ్‌ చేశాడు. కాలుష్యం వల్ల అంబేద్కర్‌కాలనీలో ఎన్నో మరణాలు సంభవిస్తు న్నా సింగరేణి యాజమాన్యం, ప్రభు త్వం నిర్లక్ష్యం వహిస్తున్నాయని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తుకారాం మృతదేహంతో గ్రామంలో స్థానికులు రాస్తారోకో చేశారు.